
అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ హత్య చేసిందని, తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఘోరి కట్టారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమలో అంబేద్కర్ చిత్రపటానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపి లక్ష్మ ణ్ ప్రభూతులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో పని చేస్తున్నామని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాజ్యాంగం చెక్కు చెదరలేదని, అది అంబేద్కర్, దేశ ప్రజలు గొప్పతనం అని తెలిపారు. అలాగే 75 సంవత్సరాలుగా రాజ్యాంగానికి తూట్లు పొడవాలని కాంగ్రెస్ చూసిందని, అంబేద్కర్ ను ఓడించేందుకు అయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నికృష్టమైన మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది అని ఆయన విరుచుకుపడ్డారు.
అంబెడ్కర్ చనిపోతే అయన పార్థివ దేహం తరలించిన విమానం ఛార్జ్ లను కూడా ఆయన భార్య దగ్గర వసూలు చేసిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ఎవరెవరికో భారత రత్న ఇచ్చుకున్నారు.. అంబేద్కర్ కు మాత్రం ఇవ్వలేదు.. చివరకు బీజేపీ చొరవతో ఆయనకు భారత రత్న వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అంబేద్కర్ తో అనుబంధం, సంబంధం ఉన్న ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దారని, పంచ తీర్థగా అభివృద్ధి చేశారని తెలిపారు. అంబేద్కర్ ను మతం మార్చుకోవాలని ఎంత ఒత్తిడి చేసిన అయన ఆ మతం లోకి మారలేదని చెబుతూ ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ను ముంబై లో పెట్టబోతున్నట్లు వెల్లడించారు.
అంబేద్కర్ జీవితం మనందరికీ స్పూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఒక్కపూట తింటూ ఉన్నత చదువు కోసం తన పదేళ్ల జీవితాన్ని బరోడా మహారాజ్ వద్ద పణంగా పెట్టి చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహోన్నతుడు అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న అవార్డుతో గౌరవమిచ్చిందని గుర్తు చేశారు.
పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖలో విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేని చెప్పారు. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. ఆయనపై కుట్ర చేసి రెండు సార్లు ఓడించింది కూడా కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఆయననను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ప్రధానం చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
అలాంటి పార్టీ నేడు అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించాలనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తక్షణమే బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కూడా కాంగ్రెస్ అని గుర్తు చేశారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను