దౌత్య‌వేత్త‌తో సంబంధం.. బంగ్లాదేశ్ మోడ‌ల్ మేఘ‌నా అరెస్టు

దౌత్య‌వేత్త‌తో సంబంధం.. బంగ్లాదేశ్ మోడ‌ల్ మేఘ‌నా అరెస్టు

బంగ్లాదేశ్‌కు చెందిన మోడ‌ల్‌, న‌టి మేఘ‌నా ఆల‌మ్‌ను ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. స్పెష‌ల్ ప‌వ‌ర్స్ యాక్టు ప్ర‌కారం ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఓ విదేశీ దౌత్య‌వేత్త‌తో త‌న‌కు సంబంధం ఉన్న‌ట్లు ఆమె ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసింది. దీంతో ఆ దేశ పోలీసులు ఆమెను ఏప్రిల్ 9వ తేదీన అరెస్టు చేశారు. 

సౌదీ అరేబియాకు చెందిన పెళ్లి అయిన దౌత్య‌వేత్త‌తో త‌న‌కు లింకు ఉన్న‌ట్లు ఆ మోడ‌ల్ త‌న ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్న‌ది. అయితే ఆ దౌత్య‌వేత్త‌ను త‌న‌ను మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ఆమె ఆరోపించింది. బంగ్లాదేశ్‌లో మేఘ‌నా ఆల‌మ్ ఓ పేరున్న న‌టి. మిస్ ఎర్త్ బంగ్లాదేశ్ పోటీల్లో ఆమె మాజీ విజేత‌. మిస్ బంగ్లాదేశ్ ఫౌండేష‌న్‌కు ఆమె చైర్‌ప‌ర్స‌న్ కూడా. 

మేఘ‌నాను అరెస్టు చేయ‌డంతో దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అయ్యింది. అధికార దుర్వినియోగం జ‌రుగుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మేఘ‌నా ఫేస్‌బుక్‌లో దౌత్య‌వేత్త గురించి ఉన్న పోస్టుల‌ను డిలీట్ చేశారు. కూతురు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఆమె తండ్రి స‌మ‌ర్థించారు. సౌదీ అంబాసిడ‌ర్‌తో త‌న కుమార్తె రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు బ‌ద్రుల్ ఆల‌మ్ తెలిపారు.

వాస్త‌వానికి మేఘ‌నాను కిడ్నాప్ చేసిన‌ట్లు తొలుత ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మేఘ‌న ఇంట్లోకి పోలీసులు వ‌చ్చి అరెస్టు చేస్తున్న దృశ్యాలు ఫేస్‌బుక్‌లో 12 నిమిషాల పాటు లైవ్ అయ్యింది. దీంతో అధికారులు రియాక్ట్ అయ్యారు. చ‌ట్టం ప్ర‌కారమే మేఘ‌నాను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. కాషింపుర్ సెంట్ర‌ల్ జైలుకు ఆమెను త‌ర‌లించిన‌ట్లు చెప్పారు.