
* ఉక్రెయిన్‌పై క్షిపణి దాడిలో 30 మంది పౌరులు మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు యత్నిస్తున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. సుమీ నగరంపై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 83 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. పామ్ సండే పండగ సందర్భంగా స్థానికులంతా ఒకచోట చేరిన వేళ రష్యా రెండు క్షిపణులతో దాడి చేసిందని ఆరోపించారు.
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను ఉక్రెయిన్ విడుదల చేసింది. ఒకవైపు శిథిలాలు, భారీగా వెలువడుతున్న పొగ ఉండగా మరోవైపు జనం భయంతో పరుగులు తీస్తున్నట్టు ఉంది. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు రెండు దేశాల మధ్య అమెరికా ఇంతకుముందు మధ్యవర్తిత్వం వహించింది.
ఆ చర్చల సందర్భంగా తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. మరోవంక, పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని మందుల నిల్వలు ధ్వంసమయ్యాయి.
కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై ఈ దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యా కావాలనే ఇండియన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్నదని విమర్శించింది. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై దాడులు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింద. భారత్‌కు తాము మిత్రులమని చెప్పే రష్యా, కావాలనే ఇలా దాడులు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది.
ఉక్రెయిన్‌లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా రష్యా దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఫార్మా కంపెనీ గోడౌన్ పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కాగా, సుమీ నగరంపై రష్యా చేసిన క్షిపణుల దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారని పేర్కొన్నారు. నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు వంటివి ధ్వంసమయ్యాయని చెప్పారు.
రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. రక్షణ, సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. రెండు క్షిపణుల దాడిలో ‘డజన్ల కొద్దీ’ మృతి చెందారని ఆయన తెలిపారు. మాస్కో విషయంలో చర్చలు ఎప్పుడూ క్షిపణులు, వైమానిక దాడులను నిలువరించలేకపోయాయని తెలిపారు. ఓ ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తారో రష్యా పట్ల అటువంటి వైఖరి అవసరమని పేర్కొంటూ రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన అసాధ్యమని స్పష్టం చేశారు. యుద్ధం ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటి నుంచి రష్యా తమపై 70 క్షిపణులను, 2 వేల 200 పేలుడు డ్రోన్లను, 6 వేల బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి