హెచ్‌సియూ భూములపై తప్పుదారి పట్టిస్తున్న మంత్రి

హెచ్‌సియూ భూములపై తప్పుదారి పట్టిస్తున్న మంత్రి
 రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా హెచ్‌సియూ భూముల వ్యవహారంలో రుణం తీసుకున్న అంశంపై ఇచ్చిన వివరణ ఉందని బిజేపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. టిజిఐఎస్‌సికి ఈ భూములు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.  టిజిఐఎస్‌సి బాండ్ల రూపంలో ఐసిఐసి వద్ద అప్పు తెచ్చిందా లేదా? ద్వైపాక్షిక ఒప్పందం చేసుకొని రుణం తీసుకున్న మాట వాస్తవం కాదా? అని ఆయన మంత్రిని నిలదీశారు.
ప్రభుత్వం నుండి నేరుగా రుణాలు తీసుకుంటే ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోకి రాకుండా టిజిఐఎస్‌సి ద్వారా రుణాలు తెచ్చారని ఆయన ఆరోపించారు. రుణం తీసుకరావడానికి రూ.170 కోట్లు కమిషన్ ఇచ్చారా లేదా? అనే దానిపై స్పష్టత లేదని ధ్వజమెత్తారు. నిన్న కాక మొన్న కూడా రెండు వేల బాండ్స్ ద్వారా లోన్స్ తెచ్చారని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు రూ.170 కోట్ల కమీషన్ ఎలా ఇచ్చారో మంత్రి శ్రీధర్ బాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

అప్పు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొంటూ వెంటనే శ్రీధర్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత 18 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏ పని చేయకుండా రూ. 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చారంటున్న మంత్రి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి అసెంబ్లీలో హెచ్‌సియూ భూముల్లో గుంట నక్కలు ఉన్నారని చెప్పారే తప్ప వారు ఎవరో చెప్పడం లేదని బిజెపి నేత విస్మయం వ్యక్తం చేశారు. సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు కేవలం బట్ట గాల్చి మీద వేయడానికి బిజెపి ఎంపీ ఉన్నారని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక వేళ అదే నిజమైతే ఇంత వరకు ఎందుకు ఆ పేరు చెప్పలేదని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంటే పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. మద్రాస్ చీకటి ఒప్పందంలో భాగంగానే రెండు పార్టీలు బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని ఏలేటి ఆరోపించారు.  బిజెపి చేసే పోరాటం చూసి రెండు పార్టీలు తమపై ఆరోపణ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో హెచ్‌సియూ కాదు ఏ భూమి అమ్మడానికి వీలులేదని స్పష్టం చేశారు. భూముల అమ్మకంపై ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడుతుందని ఏలేటి హెచ్చరించారు.