టీ20ల్లో కోహ్లీ ‘వంద’ అర్ధ శ‌త‌కాలతో రికార్డు

టీ20ల్లో కోహ్లీ ‘వంద’ అర్ధ శ‌త‌కాలతో రికార్డు

భార‌త మాజీ సార‌థి విరాట్ కోహ్లీ టీ20ల్లో మ‌రో సంచ‌ల‌నం సృష్టించాడు. పొట్టి క్రికెట్‌లో 100 అర్ధ శ‌త‌కాల‌తో రికార్డు నెల‌కొల్పాడు. ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో చెల‌రేగి ఆడుతున్న అత‌డు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై హాఫ్ సెంచ‌రీతో గ‌ర్జించాడు. దాంతో, దేశం త‌ర‌ఫున, ఐపీఎల్‌లో క‌లిపి టీ20ల్లో వందో ఫిఫ్టీ న‌మోదు చేశాడీ కింగ్. త‌ద్వారా ఈ మైలురాయికి చేరువైన తొలి భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు లిఖించాడు.

అంత‌ర్జాతీయంగా ఈ ఘ‌న‌త‌కు చేరువైన రెండో క్రికెట‌ర్‌గా విరాట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెట‌ర్ కాగా, కోహ్లీ అత‌డి స‌ర‌స‌న చేరాడు. వార్న‌ర్ 108 ఫిఫ్టీలతో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. టీ20ల్లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు బాదిన వాళ్ల‌లో కోహ్లీ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. పాకిస్థాన్ మాజీ సార‌థి బాబ‌ర్ ఆజాం 90 ఫిఫ్టీల‌తో మూడో స్థానంలో నిల‌వ‌గా, వెస్టిండీస్ మాజీ ఓపెన‌ర్ క్రిస్ గేల్ 88 అర్ధ శ‌త‌కాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

86 సార్లు యాభైకి పైగా కొట్టిన‌ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ ఐదో స్థానం ద‌క్కించుకున్నాడు. బార్బడోస్ గ‌డ్డ‌పై టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చెల‌రేగిన విరాట్, ట్రోఫీ అందుకున్నాక పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లికాడు. కానీ, త‌న‌కెంతో ఇష్ట‌మైన ఐపీఎల్‌లో కొన‌సాగుతున్నాడీ ర‌న్ మెషీన్. త‌మ జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు తొలి టైటిల్ అందించాల‌నే క‌సితో ఉన్నాడు.

టీమిండియాకు త‌ర‌గ‌ని ఆస్తిలా మారిన విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. టెస్టుల్లో 9,230 ర‌న్స్, వ‌న్డేల్లో 14,18, టీ20ల్లో 4,188 ప‌రుగులు అత‌డి ఖాతాలో ఉన్నాయి.