మాంద్యం భయంతో సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్

మాంద్యం భయంతో సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ఉన్నట్టుండి ప్రపంచ దేశాలపై వేస్తున్న సుంకాలను మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విరామానికి ప్రధాన కారణం ఆ దేశం మాంద్యం భారిన పడనుందనే నివేదికలే అని తెలుస్తున్నది. దీనికి తోడు సుంకాలను ఆపాలని పెట్టుబడిదారుల ఒత్తిడి పని చేసిందని చెబుతున్నారు. 
 
ట్రంప్‌ అధిక టారిఫ్‌లు ఈ నెల 9 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. చివరి నిమిషంలో ట్రంప్‌ వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 46 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌పై సుంకాలు విధించిన తర్వాత, గ్లోబల్‌ మార్కెట్లలో నెలకొన్న గందరగోళం, మాంద్యం ముప్పు కారణంగా ట్రంప్‌ తన నిర్ణయంపై వెనక్కి తగ్గారని బ్లూమ్‌బర్గ్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది.
 
తమ మంత్రిత్వశాఖలు, వాణిజ్య ప్రతినిధితో 75 దేశాలు సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. రిపబ్లికన్‌ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ మనకు ఫోన్లు చేస్తున్న దేశాల వారు ప్లీజ్‌ ప్లీజ్‌ సర్‌ ఒప్పందం చేసుకోండి, నేను ఏదైనా చేస్తాను అని చెబుతున్నారని తెలిపారు.  అయితే, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని మాత్రం 125 శాతం నుంచి 145 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ గురువారం ప్రకటించారు. మార్చి నాటికి ఈ సుంకాలు 10 శాతంగా ఉండగా, ఇటీవల 34 శాతానికి పెంచారు. ఆ తర్వాత క్రమంగా హెచ్చించడం గమనార్హం.
 
అమెరికా ఆధిపత్య, బెదిరింపు ధోరణులను గట్టిగా తిప్పికొడతామని చైనా ప్రకటించింది. “తన సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడుకోవడానికి, ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయబద్ధత, న్యాయం, బహుళపక్ష వాణిజ్యం, ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ప్రతిఘటనా చర్యలు చైనా తీసుకుంటుంది” అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లీన్‌ జియాన్‌  స్పష్టం చేశారు.
 
అమెరికాలో మరో ఆర్థిక మాంద్యానికి ట్రంప్‌ కారణమవుతున్నారని పరిశోధనా సంస్థలు విశ్లేషించాయి. సుంకాలు పెంచుకుంటూ వెళ్లడం ఆర్థిక ఆణు యుద్ధంతో సమానమని పేర్కొన్నాయి. దాని పరిణామాలను అమెరికానే ఎక్కువగా భరించాల్సి వస్తుందని హెచ్చరించాయి.
 
కాగా, అల్లకల్లోల ప్రపంచంలోనూ భారత్‌ చుక్కానిలా ఎదుగోతందని ఎన్‌ఎస్‌ఇ ఎమ్‌డి, సిఇఒ అశిష్‌ కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. భారత మార్కెట్లు గరిష్ట స్థాయి నుంచి 1.5 ట్రిలియన్‌ డాలర్లు తగ్గినప్పటికీ.. మూలధన మార్కెట్లు దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు.  2014లో భారత మార్కెట్ల క్యాప్‌ 1 ట్రిలియన్‌ డాలర్ల కంటే తక్కువగా ఉండగా,  ఇప్పుడు 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఎస్‌ఐపి రూపంలో ప్రతి నెలా మార్కెట్లలోకి 2.5-3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.
ప్రతీకార సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను ఉపసంహరించుకునేలా సమైక్య ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇతర దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది. అయితే ట్రంప్‌తో వాణిజ్య యుద్ధానికి జంకుతున్న చాలా దేశాలు చైనాతో జతకట్టేందుకు ముందుకు రావడం లేదు.
యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌తో చైనా ప్రధాని లీ జియాంగ్‌ ఫోన్‌ ద్వారా చర్చలు జరిపిన నేపథ్యంలో ప్రపంచ దేశాల నాయకుల మద్దతు కూడగట్టగలమని చైనా ఆశిస్తోంది. ఇదిలా ఉండగా అమెరికా విధించిన ప్రతీకార సుంకాలకు ప్రతిచర్యగా అమెరికన్‌ సినిమాల దిగుమతిపై చైనా కోత విధించడంతోపాటు బెదిరింపులు మాని న్యాయ సమ్మతమైన చర్చలకు ముందుకు రావాలని అమెరికాకు పిలుపునిచ్చింది.