హిందువులపై అసభ్యకర వ్యాఖ్యలతో డీఎంకే నేత తొలగింపు

హిందువులపై అసభ్యకర వ్యాఖ్యలతో డీఎంకే నేత తొలగింపు
తమిళనాడు అటవీశాఖ మంత్రి పొన్ముడ హిందూ మహిళలలను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనను ముఖ్యమంత్రి పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుండి తొలగించారు. అయితే, మంత్రిగా కొనసాగిస్తున్నారు. 
ఒక బహిరంగ కార్యక్రమంలో మహిళలు, శైవులు, వైష్ణవుల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తమిళనాడు మంత్రి కె పొన్ముడిని శుక్రవారం అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకె) పార్టీ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుండి  తొలగించింది. రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివను ఆ పదవిలో పార్టీ అధినేత స్టాలిన్ నియమించారు.
 
తమిళనాడు అటవీ శాఖ మంత్రి, సీనియర్ డీఎంకే నేత కే పొన్ముడి ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ మతపరమైన బొట్టును శృంగారంతో ముడిపెట్టారు. “మహిళలు, దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వెళ్తాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డ బొట్టు (శైవమతానికి సంబంధించినది) లేదా నామం (వైష్ణవానికి సంబంధించిన నిలువు తిలకం) అతడు ధరిస్తాడా? అని అడిగింది. ఆ వ్యక్తి శైవుడైతే ‘పడుకునే’ పొజిషన్‌, వైష్ణవుడు అయితే ‘లేచి నిలబడే’ పొజిషన్‌ ఉంటుందని ఆమె వివరించింది” అని జోక్‌ వేశారు.

కాగా, డీఎంకే మంత్రి పొన్ముడి వివాదస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ‘మంత్రి పొన్ముడి ప్రసంగం ఆమోదయోగ్యం కాదు. ప్రసంగానికి కారణం ఏమైనప్పటికీ, అలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఖండించదగినవి’ అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్, సింగర్ చిన్మయి శ్రీపాద తదితరులు ఘాటుగా విమర్శించారు.

డిఎంకె ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ మంత్రులలో పొన్ముడి ఒకరు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 2023లో పొన్ముడిని, ఆయన కుమారుడు, కళ్లకురిచ్చి పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమ్నైని ఇంకా వారి కుటుంబ సభ్యులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ రూ.14 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది.

మద్రాస్ హైకోర్టు 2023లో ఆయనను దోషిగా నిర్ధారించి, నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీని ఫలితంగా ఆయన వెంటనే శాసనసభ్యుడిగా అనర్హత వేటు పడడంతో అప్పట్లో మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, మార్చ్ 2024లో సుప్రీంకోర్టు శిక్షను నిలిపివేయడంతో స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి మాటలతో పార్టీ పదవిని పోగొట్టుకున్నారు పొన్ముడి.

పొన్ముడి వ్యాఖ్యలపై బిజెపి ఐటి సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై దాడి చేసిన తర్వాత ఇపుడు హిందూ వ్యతిరేకతను నిందించే చర్యను ముందుకు తీసుకున్నారని ధ్వజమెత్తారు. పొన్ముడి ఒక వేశ్య, ఒక వ్యక్తికి సంబంధించిన అసభ్యకరమైన కథను చెప్పారని, అక్కడ అతను పవిత్ర హిందూ చిహ్నాలను అసభ్యకరమైన లైంగిక సూచనలకు తగ్గించాడని మండిపడ్డారు.