ఆస్తుల వివరాల వెల్లడికి న్యాయమూర్తుల అంగీకారం

ఆస్తుల వివరాల వెల్లడికి న్యాయమూర్తుల అంగీకారం
న్యాయమూర్తుల ఆస్తుల వివరాలకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఫుల్ కోర్టు సమావేశంలో ఆస్తుల వివరాల వెల్లడికి న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. ప్రతి ఏడాదీ క్రమంగా తమ ఆస్తుల వివరాలను భారత ప్రధాన న్యాయమూర్తికి వెల్లడించడానికి న్యాయమూర్తులు అంగీకరించారు.  న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా సీజేఐ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు లభించిన నేపథ్యంలో న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించడంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటికే చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయి, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరి తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. చీఫ్‌ జస్టిస్‌ సహా సుప్రీంకోర్టులో ప్రస్తుతం 30 మంది విధులు నిర్వహిస్తున్నారు.
ఈ నెల ఒకటో తేదీన వీరందరితో ఫుల్‌కోర్టు సమావేశం జరిగింది.  సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్కరూ తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అంతకుముందు,1997లో చేసిన తీర్మానం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందించాల్సి ఉంది. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలంటూనే దానిని తప్పనిసరి చేయకుండా, జడ్జిల ఇష్టానికే వదిలేస్తూ 2009లో ఒక తీర్మానం చేశారు. 

 
న్యాయమూర్తుల ఆస్తులకు సంబంధించి అనేక చర్చలు జరిగాయి. ఆ సమయంలో పలువురు న్యాయమూర్తులు స్వచ్ఛందంగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు ముందుకు వచ్చారు కూడా. కానీ మరికొందరు మాత్రం దాన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా భావించారు. అయితే ప్రస్తుతం ఫుల్ కోర్టు సమావేశంలో ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు న్యాయమూర్తులంతా ఏకగ్రీవంగా అంగీకరించడం ఇదే తొలిసారి.
దీని వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగే అవకాశం ఉంది అనేది జడ్జిలు చెబుతున్నారు.  న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన అనేది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇంతకు ముందు కేవలం సీజేఐ మాత్రమే ఆస్తుల వివరాలను వెల్లడించడం జరిగేది. కానీ వాటిని వెబ్‌సైట్‌లో పెట్టలేదు. కానీ ఇప్పుడు సీజేఐ, ఇతర న్యాయమూర్తులు అందరూ కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు.