ప్రధాని మోదీ టీకా దౌత్యాన్ని ప్రశంసించిన శ‌శి థ‌రూర్‌

ప్రధాని మోదీ టీకా దౌత్యాన్ని ప్రశంసించిన శ‌శి థ‌రూర్‌
ప్ర‌ధాని నరేంద్ర మోదీపై మ‌రోసారి ప్ర‌శంస‌లు కురిపించారు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శ‌శి థ‌రూర్‌. కరోనా స‌మ‌యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ దేశాల‌తో టీకా దౌత్యాన్ని నిర్వ‌హించిన తీరును ఆయ‌న మెచ్చుకున్నారు. ఇటీవ‌ల సీనియ‌ర్ కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ ప‌లుమార్లు కేంద్ర ప్ర‌భుత్వ విదేశాంగ విధానాల‌ను ప్ర‌శ‌సించారు. 
 
దీంతో కాంగ్రెస్ పార్టీల‌తో ఇత‌ర సీనియ‌ర్ నేత‌ల‌తో శ‌శి థ‌రూర్ మ‌ధ్య దూరం ఏర్ప‌డింది. శ‌శిథ‌రూర్ బీజేపీలో చేరుతారేమో అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అయ్యాయి. అయితే కేవ‌లం విదేశీ విధానాల‌ను మెచ్చుకుంటున్నాన‌ని, తానేమీ పార్టీ మార‌డం లేద‌ని థ‌రూర్ ఇటీవ‌ల స్ప‌ష్టం చేశారు.

తాజాగా ద వీక్ వారపత్రికలో రాసిన ఓ క‌థ‌నంలో ఎంపీ థ‌రూర్‌ కరోనా మ‌హమ్మారి వేళ కేంద్ర స‌ర్కారు చేప‌ట్టిన టీకా దౌత్యంను మెచ్చుకున్నారు. అంత‌ర్జాతీయ నాయ‌క‌త్వానికి ఇదో శ‌క్తివంత‌మైన ఉదాహ‌ర‌ణ అని ఆ క‌థ‌నంలో రాశారు. చాలా బాధ్య‌తాయుతంగా, ఎంతో సంఘీభావంతో ఆ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు కొనియాడారు. 

క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ప‌రిస్థితి ఏర్ప‌డి అయిదేళ్ల అయిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ క‌థ‌నాన్ని రాశారు. ప్ర‌పంచ‌వ్యాప్త ఆరోగ్య దౌత్యంలో భార‌త ఓ కీల‌క‌మైన దేశంగా ఎదిగింద‌ని తెలిపారు. సుమారు వంద‌కుపైగా దేశాల‌కు రెండు అతిప్ర‌ధాన‌మైన కరోనా టీకాల‌ను భార‌త్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు త‌న క‌థనంలో పేర్కొన్నారు.

మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు సుమారు వంద‌కుపైగా దేశాల‌కు వెళ్లాయ‌ని, అత్య‌వ‌స‌ర‌మైన స‌మ‌యంలో చేయూత‌ను అందించి భారత్ త‌న సామ‌ర్థ్యాన్ని నిరూపించింద‌ని పేర్కొన్నారు. వ‌సుదైక కుటుంబం అన్న భావాన్ని భార‌త్ వినిపించింద‌ని కొనియాడారు. ఉప ఖండంలోని ఇత‌ర దేశాల‌తోనూ స‌ఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించింద‌ని ప్రశంసించారు. 

“భారతదేశం రెండు ప్రధాన వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసింది: కోవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసి, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది), కోవాక్సిన్ (భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది). భూటాన్, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్రికన్ దేశాలతో సహా 100 కి పైగా దేశాలకు ఈ వ్యాక్సిన్‌లను సరఫరా చేసింది. ప్రపంచ సంఘీభావాన్ని నొక్కి చెప్పే వసుధైవ కుటుంబకం (ప్రపంచం ఒక కుటుంబం) తత్వశాస్త్రంలో పాతుకుపోయిన తన చొరవను ప్రభుత్వం జాగ్రత్తగా అమలు చేసింది” అని శశి థరూర్ కొనియాడారు.
 
“ఉపఖండంలోని ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం పొరుగువారు ముందు విధానంతో ఇది సమన్వయం చేసుకోవడం అదనపు బోనస్. అలా చేయడం ద్వారా, భారతదేశం ప్రపంచ ఆరోగ్య దౌత్యంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది” అని మెచ్చుకున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న స‌వాళ్ల‌ను ఎదుర్కొనే సామ‌ర్థ్యాన్ని భారత్ ప్ర‌ద‌ర్శించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆధ్వ‌ర్యంలోని కోవాక్స్ ప్రోగ్రామ్‌కు ఇండియా స‌హ‌కారం అందించ‌డాన్ని కాంగ్రెస్ నేత ప్ర‌శంసించారు. కరోనా రెండో వేవ్ స‌మ‌యంలో వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా స్తంభించినా అంత‌ర్జాతీయ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్య‌వ‌హ‌రించిన‌ట్లు తెలిపారు. 

భార‌త్ త‌న టీకా దౌత్యాన్ని ప్ర‌ద‌ర్శించిన తీరు విదేశీ విధానంలో కీల‌క‌మైంద‌ని చెప్పారు. మాన‌వ‌త్వాన్ని, వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని భార‌త్ వ్య‌వ‌హ‌రించింద‌ని మెచ్చుకున్నారు. ట్రంప్‌ను వైట్‌హౌజ్‌లో క‌ల‌వ‌డం, ఉక్రెయిన్ యుద్ధం విష‌యంలో పుతిన్, జెలెన్‌స్కీల‌తోనూ మోదీ నిర్వ‌హించిన దౌత్య రీతిని థ‌రూర్ గ‌తంలో మెచ్చుకున్నారు.