
మ్యాచ్‌ల ఫ్రీ పాస్‌ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధికారులు వేధిస్తున్నట్లు పెద్ద ఎత్తున తలెత్తిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వేధింపుల కారణంగా తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియాన్ని వదిలి వెళ్తామంటూ సన్ రైజర్స్ అసహనాన్ని వ్యక్తం చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
పాస్‌ల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ సంచలన ఆరోపణలు చేసింది.
ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు. ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి.
ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం అని సన్ రైజర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. గత రెండు సీజన్లుగా హెచ్‌సీఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ఈ విషయాన్ని హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని సన్ రైజర్స్ తెలిపింది. హెచ్‌సీఏ ప్రవర్తన చూస్తుంటే, ఈ స్టేడియంలో తాము ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోందని ఆరోపించింది.
ఇదే నిజమైతే, బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, తమ యాజమాన్యంతో చర్చించి, హైదరాబాద్‌ను వదిలి, కొత్త వేదికను చూస్తామని శ్రీనాథ్ హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏ కలిసి పనిచేస్తున్నామని, గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నామని తెలిపింది. సన్‌రైజర్స్ టీం హైదరాబాద్ నుంచి వెళ్లిపోతుందనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
“ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో హెచ్‌సీఏకు 10శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా ఇస్తున్నాం. కానీ, ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్‌లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై తర్వాత మాట్లాడుకుందామని చెప్పినా వినడం లేదు. టికెట్లు ఇస్తేగానీ బాక్స్‌లు తెరవమంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు భరించడం మా వల్ల కాదు.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతాం” అని శ్రీనాథ్ వెల్లడించారు.
ఈ పరిణామాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సన్ రైజర్స్ యాజమాన్యాన్ని వేధిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశంపై ఇప్పటికే వివరాలు సేకరించిన సీఎం దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస రెడ్డిని ప్రభుత్వం కోరింది. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మండిపడ్డారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు