ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌పై చట్టాల బాధ్యత రాష్ట్రాలదే

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌పై చట్టాల బాధ్యత రాష్ట్రాలదే

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌, గ్యాబ్లింగ్‌కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతని కేంద్రం లోక్‌సభలో స్పష్టం చేసింది. లోక్‌సభలో ఈ అంశంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు. 

లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆన్‌లైన్ గేమింగ్ సైట్‌లను నిషేధించడానికి ఎందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, ఈ విషయంలో కేంద్రం సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దీనికి ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందిస్తూ  రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ రాష్ట్రాల జాబితా కిందకు వస్తాయని, ఈ క్రమంలో చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి, దేశ సమాఖ్య నిర్మాణాన్ని గౌరవించండి’ కేంద్ర మంత్రి స్పందించారు. 

ఇప్పటి వరకు 1,410 ఆన్‌లైన్ గేమింగ్ సైట్‌లపై చర్యలు తీసుకున్నామని, వాటిని నిషేధించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని, అయితే చట్టపరంగా తమ ప్రాంతాల్లో వాటిని నియంత్రించడం రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు. ‘ఇండియన్ జస్టిస్ కోడ్’ సెక్షన్ 112 కింద ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై చర్యలు తీసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.