
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న కారణంతో హమాస్‌పై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తన జోరును మరింత పెంచింది. తాజాగా శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దక్షిణ గాజా స్ట్రిప్ పరిధిలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక రాజకీయ నాయకుడు, అక్టోబర్ 7 నాటి ఊచకోత సూత్రధాని సలాహ్ అల్‌బర్దావిల్ సహా కనీసం 19 మంది పాలస్తీనియన్లు హతమయ్యారు.హమాస్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యాలయంలో సభ్యుడుగా ఉన్న బర్దావిల్, ఆయన భార్య మరణించినట్లు పాలస్తీనా మీడియా తొలుత వెల్లడించింది. ఆ తర్వాత హమాస్ మీడియా సలహాదారు తాహెర్ అల్ నోనో కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. బర్దావిల్, ఆయన భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో మరణించినట్లు అల్ నోనో తెలిపారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఉల్లంఘనకు గురైందంటూ ఇజ్రాయెల్ మళ్లీ కాల్పులతో విరుచుకుపడుతోంది. గత మంగళవారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 400 మందికి పైగా మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం మార్పులను హమాస్ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు. కాగా, ఇజ్రాయెల్ దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హమాస్ హెచ్చరించింది. కాగా, గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 85 మంది మృతిచెందారు.
బందీలను విడిచిపెట్టకుంటే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హమాస్‌ను హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా, హమాస్‌తో పొత్తు ఉన్న యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై మరొక క్షిపణి ప్రయోగించారు. దీనితో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. ఆ క్షిపణిని అడ్డుకున్నామని, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం గురించిన సమాచారం ఏదీ లేదని ఇజ్రాయెలీ మిలిటరీ తెలియజేసింది.
More Stories
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకారం