
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 5న శ్రీలంకను సందర్శించనున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె ప్రకటించారు. దిస్సనాయకె పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేస్తూ మోదీ పర్యటనకు తేదీని వెల్లడించినట్లు వార్తా పోర్టల్ ‘అడదెరాన.ఎల్‌కె’ తెలియజేసింది.
శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరాత్ క్రితం వారం ప్రకటించిన విధంగా అధ్యక్షుడు దిస్సనాయకు నిరుడు ఢిల్లీ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాల ఖరారు నిమిత్తం మోదీ కొలంబో వస్తారు. తూర్పు తీరమైన ట్రిన్‌కోమలి జిల్లాలోని సంపూర్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ కార్యక్రమం భారత ప్రధాని పర్యటన సమయంలోనే మొదలవుతుందని కూడా అధ్యక్షుడు పార్లమెంట్‌కు తెలిపారు.
శ్రీలంకలో సుస్థిర పరిస్థితుల కారణంగా మోదీ సందర్శిస్తున్నారని దిస్సనాయకె తెలియజేశారు. క్రితం నెల ఆ ద్వీప దేశంలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీలంక, భారత్ ఒక ఒప్పందానికి వచ్చినట్లు శ్రీలంక ఆరోగ్య శాఖ మంత్రి నళిందా జయతిస్స ప్రకటించారు.
“రెండు ప్రభుత్వాల మధ్య సంయుక్త రంగ సంస్థగా సిలోన్ విద్యుత్ బోర్డు, భారత జాతీయ థర్మల్ విద్యుత్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) నిర్మాణం, యాజమాన్యం, నిర్వహణ పద్ధతిపై ట్రిన్‌కోమలి సంపూర్‌లో 50 మెగావాట్ల (మొదటి దశ); 70 మెగావాట్ల (రెండవ దశ) ఉత్పాదక శక్తితో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీలంక ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం కుదిరింది” అని జయతిస్స తెలియజేశారు.
అంతకుముందు ఎన్‌టిపిసి అదే స్థలంలో బొగ్గు ఇంధనంగా విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించవలసి ఉంది. కొత్త సంయుక్త రంగ సంస్థ దానిని సౌర విద్యుత్ కేంద్రంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.
More Stories
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకారం