హిందూ ధర్మ పరిరక్షణ కోసమే బజరంగ్ దళ్

హిందూ ధర్మ పరిరక్షణ కోసమే బజరంగ్ దళ్
హిందూ ధర్మ పరిరక్షణ కోసమే బజరంగ్ దళ్ ఆవిర్భవించిందని విశ్వహిందూ పరిషత్  రాష్ట్ర  ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్ తెలిపారు.  భారతీయ వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు బజరంగ్దళ్ నిరంతరం సంఘర్షణ చేస్తోందని చెప్పారు.  ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైకుంఠ పురం శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరంలో జరిగిన బజరంగ్ దళ్ సమావేశం సందర్భంగా దాదాపు 600 మంది కార్యకర్తలు త్రిశూల్ దీక్ష పొందారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ధర్మకార్యంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు.  హిందూ అమ్మాయిలను చెర బట్టి, మతమార్పిడి చేసే దుర్మార్గుల విషయంలో కఠినంగా ఉండాలని, మాయమాటలు చెప్పి మతమార్పిడికి పాల్పడే దుండగులకు తగిన బుద్ధి చెప్పే విషయంలో ముందుండాలని సూచించారు. దేవాలయాల భూములు కబ్జాకు గురవుతున్నాయని, దేవాలయాల విషయంలో పాలకుల వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ముక్కోటి దేవతలకు నిలయమైన గోవులను రక్షించి ధర్మాన్ని నిలబెట్టాలని, ప్రతి గ్రామానికి ఒక ఆంజనేయ స్వామి మందిరం ఏ విధంగా ఉంటుందో .. అదేవిధంగా ప్రతి గ్రామానికి బజరంగ్దళ్ కార్యకర్త అవసరం కూడా ఉందని చెప్పారు. పేద, ధనిక, నిమ్న ,అగ్ర వర్ణాల  భేదం  లేకుండా హిందువులంతా సంఘటితమై నిలబడాలని కోరారు. 
 
సమాజంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్, లోన్ యాప్స్ ద్వారా అత్యధికంగా హిందువులే నష్టపోతున్నారని చెబుతూ ఈ విషయంపై హిందూ యువత జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు. కుటుంబ విలువలు పాటిస్తూ, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలని పేర్కొన్నారు.  విధర్మీయుల దాడిని ఎదుర్కొనేందుకు త్రిశూల్ దీక్ష ఉపయోగపడుతుందని చెప్పారు. 
 
 అంతకుముందు అయోధ్య రాముడు, ఆంజనేయస్వామి, భరతమాత చిత్రపటాలకు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. త్రిశూల్ దీక్ష తీసుకున్న యువకిశోరాలపై వేద పండితులు ప్రత్యేకంగా కురిపించిన పూలవర్షం ఆకర్షణగా నిలిచింది. మహిళలు పెద్దలు  భారీ సంఖ్యలో హాజరై హిందూ సంఘటన కార్యక్రమంలో పాలుపంచుకోవడం విశేషం.
 
 పరిషత్ ధర్మ ప్రసార రాష్ట్ర సహ ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్ త్రిశూల్ దీక్ష అవసరం, దాని గొప్పదనం గురించి వివరించారు. ప్రతి కార్యకర్త నిష్టతో ధర్మం కోసం పనిచేయాలన్నారు.  కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర ప్రశిక్షణ ప్రముఖ్ ముఖేష్, శ్రీధర్ గౌడ్, బజరంగ్ దళ్  సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.