ఏపీలో శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్ట్

ఏపీలో శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న 7 ఎయిర్పోర్టుల సంఖ్య పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళంలో కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

ఏపీలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల సంఖ్యను 14కు పెంచి, రాష్ట్రాన్ని లాజిస్టిక్‌ హబ్‌గా మార్చాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనల పట్ల కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూడా సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలో ముందుగా అమరావతి, శ్రీకాకుళంలో విమానాశ్రయాల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు తాజాగా “ఎక్స్”లో ఆసక్తికరంగా స్పందిస్తూ శ్రీకాకుళం ఎంపీగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం విమానాశ్రయం కల సాకారమవుతున్నందుకు గర్విస్తున్నట్లు వెల్లడించారు. 

“రాష్ట్రంలో, కేంద్రంలోని సమర్థవంతమైన నాయకత్వంతో సవాళ్లను అధిగమించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలపరచడంతోపాటు ప్రజలకు కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ విమానాశ్రయం గేమ్ – ఛేంజర్‌గా మారుతుంది.” అని ఆయన పోస్ట్ చేశారు.

ఇప్పటికే అమరావతి, శ్రీకాకుళం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటు కోసం టెక్నికల్, ఎకనామికల్ ఫీజిబులిటీ రిపోర్టు తయారు చేసేందుకు ఇటీవలే కన్సల్టెన్సీలను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఇలా స్పందించడంతో ఎయిర్ పోర్టు ఏర్పాటు కల అతి త్వరలోనే సాకారం కాబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మంత్రి చేసిన ట్వీట్ వైరల్గా మారింది.ఇదిలా ఉంటే, కన్సల్టెన్సీల ఎంపిక తర్వాత అవి అధ్యయనం చేస్తాయి. ఏ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఎంత మేర వ్యాపారాభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి అనే అంశంతోపాటు సాంకేతిక, ఆర్థిక అంశాలపై అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి అందిస్తాయి. ఆ నివేదిక ప్రకారం కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.