
ఇజ్రాయెల్ దాడులతో గాజాపట్టి మళ్లీ దద్దరిల్లుతోంది. రెండ్రోజుల క్రితం దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సైన్యం వాటిని మరింత విస్తరించింది. మళ్లీ భూతల దాడులు మొదలు పెట్టింది. మంగళవారం 400 మందికిపైగా చనిపోగా తాజాగా మరో 85మంది మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది.
బందీల విడుదలకు హమాస్ నిరాకరించినందునే మళ్లీ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులను తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొన్న హమాస్ ఇది బందీల ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తుందని హెచ్చరించింది. గాజాలో పాక్షికంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో భూతల దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
గాజాలో సెక్యూరిటీ జోన్ విస్తరించటంతోపాటు ఉత్తర, దక్షిణ గాజా మధ్య పాక్షిక బఫర్ జోన్ ఏర్పాటుకు వీలుగా మధ్య, దక్షిణ గాజాపట్టీలో భూతల దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నెట్‌జరిమ్ కారిడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరో 85మంది మృతి చెందారు. వారిలో 65మంది ఉత్తర, మధ్య గాజాలో మిగితా 20 మంది దక్షిణ గాజాలోని రఫా, ఖాన్‌యూనిస్ నగరాల్లో చనిపోయినట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ దాడులపై హమాస్ తీవ్రంగా మండిపడింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు హమాస్ పేర్కొంది.
బందీలందరినీ తిరిగివ్వడానికి ఇదే చివరి అవకాశమని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడులతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య 2నెలలుగా కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కాలం చెల్లినట్లయింది.
More Stories
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకారం