కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం

కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం

కుంభమేళా ద్వారా భారత వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించిందని పేర్కొంటూ ప్రయాగరాజ్‌లో కుంభమేళా విజయవంతంగా నిర్వహించడం సమిష్టి కృషికి అసలైన ఉదాహరణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘కుంభమేళా విజయవంతం చేసేందుకు ఎందరో తమ వంతు పాత్ర పోషించారు. ఆ కర్మ యోగులందరికీ నా ధన్యవాదాలు’’ అని మంగళవారం లోక్‌సభలో కుంభమేళా గురించి ప్రస్తావిస్తూ చెప్పారు.

భిన్నత్వంలో ఏకత్వానికి ఆలవాలమైన భారత సంస్కృతి కుంభమేళాలో ఆవిష్కృతమైందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాల కారణంగా దేశాల మధ్య ఎడం పెరుగుతున్న నేపథ్యంలో భారత దేశం.. భిన్నత్వంలో ఏకత్వమే తన ప్రత్యేకత అని కుంభమేళాతో గొప్పగా చాటుకుందని తెలిపారు. 

మహా కుంభమేళాలో యువతరం పెద్ద ఎత్తున పాల్గొనడంపై కూడా ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను ఆధ్యాత్మికతను యువత సగర్వంగా అందిపుచ్చుకున్నదని కొనియాడారు.  ‘‘కుంభమేళాలో భారత వైభవాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఈ మహాసంరంభంలో యావత్ దేశం ఉత్సాహంగా పాల్గొంది. భవిష్యత్తు తరాలకు ఈ సంరంభం స్ఫూర్తిగా నిలుస్తుంది. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రశ్నించే వారికి కుంభమేళా విజయం తగిన జవాబు ఇచ్చింది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

“మహాకుంభమేళా విజయం అందరూ కలిసికట్టుగా చేసిన కృషి ఫలితం. భారత్‌ గొప్పతనాన్ని మహాకుంభ్‌ రూపంలో ప్రపంచం మొత్తం చూసింది. మహా కుంభ్‌లో జాతీయ మేల్కొలుపును మనం చూశాం. ఇది కొత్త విజయాలకు ప్రేరణనిస్తుంది. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసింది” అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. 

“కుంభమేళాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఆవిష్కృతమయ్యాయి. ఇది దేశ ప్రజల విజయం. కుంభమేళా ప్రజల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచింది. ఈ చారిత్రాత్మక ఘట్టం భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా నిలుస్తుంది” అని ప్రధాని మోదీ తెలిపారు.

144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా 45 రోజుల పాటు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26తో ముగిసిన ఈ మహా సంరంభంలో ఏకంగా 66 కోట్ల మంది పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పవిత్రస్నానం ఆచరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. 

ఇక ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ కూడా స్వయంగా గంగా, యమున, సరస్వతీ నదుల సమాగమమైన త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం చేశారు. గంగా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, కుంభమేళాలో అక్కడక్కడా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగింది. 

ఈ ప్రమాదంలో 30 మంది మరణించినట్టు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే, మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని ప్రతిపక్షం ఆరోపించింది. ఇక కుంభమేళా జలాల్లో మావన వ్యర్థాల్లో కనిపించే ఫీకల్ కోలీఫార్మ్ బ్యాక్టీరియా ఉందన్న కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి.