పాకిస్థాన్‌ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్

పాకిస్థాన్‌ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్

* దక్షిణాఫ్రికా రాయబారిపై బహిష్కరణ వేటు

రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. పలు దేశాలపై భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను స్వదేశాలకు సాగనంపారు.

అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించే అంశాన్ని ట్రంప్‌ సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం.  ఈ 41 దేశాలను మూడు గ్రూపులుగా విభజించి, ఆయా దేశాలపై ప్రయాణ పరిమితులను విధించనునట్లు తెలిసింది.

మొదటి గ్రూప్‌లో అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటి పది దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇక, రెండో గ్రూప్‌లో ఇరిట్రియా, హైతీ, లావోస్‌, మయన్మార్‌, దక్షిణ సూడాన్‌ దేశాలున్నాయి. ఈ దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు. 
 
ఈ దేశాలకు చెందిన పౌరులకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి. మూడో  గ్రూప్‌లో పాకిస్థాన్‌, భూటాన్‌ సహా మొత్తం 26 దేశాలు ఉన్నట్లు తెలిసింది. ఈ దేశాలు తమ భద్రతా తనిఖీలను మెరుగుపరుచుకునేందుకు 60 రోజుల గడువు ఇస్తారు. 

ఆ సమయంలో లోపాలన పరిష్కరించుకోవచ్చు. ఒక వేళ ఇచ్చిన గడువులోపు ఆ దేశాలు ఆ ప్రయత్నాలు చేయడంలో విఫలం అయితే.. అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే, ప్రయాణ ఆంక్షలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
 
ఇలా ఉండగా, యూఎస్‌లోని దక్షిణాఫ్రికాకు చెందిన రాయబారి ఇబ్రహీం రసూల్‌ పై ట్రంప్‌ సర్కార్‌ తాజాగా వేటు వేసింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్‌ ఈ గొప్ప దేశంలో ఉండేందుకు ఆహ్వానించదగిన వ్యక్తి కాదని పేర్కొన్నారు. 
 
ఆయన అధ్యక్షుడు ట్రంప్‌ను ద్వేషించే వ్యక్తి అని, ఒక జాతి విద్వేష రాజకీయ నాయకుడు అని, దీనిపై ఆయనతో చర్చించాల్సింది ఏమీ లేదని రూబియో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రసూల్‌ ట్రంప్‌ పరిపాలనపై వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఆ కారణంగానే ఆయనపై బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. 
 
రసూల్‌పై బహిష్కరణ వేటుపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇబ్రహీం రసూల్‌ 2010 నుంచి 2015 వరకు అమెరికాలో దక్షిణాఫ్రికా రాయబారిగా పనిచేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తిరిగి ఆ పదవిని చేపట్టారు.