కర్ణాటకలో ముస్లిం కాంట్రాక్ట‌ర్ల‌కు 4 శాతం కోటా

కర్ణాటకలో ముస్లిం కాంట్రాక్ట‌ర్ల‌కు 4 శాతం కోటా
ప్ర‌భుత్వ టెండ‌ర్ల‌లో ముస్లిం కాంట్రాక్ట‌ర్ల‌కు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు క‌ర్నాట‌క స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న‌ది. శుక్ర‌వారం ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆ తీర్మానానికి ఆమోదం తెలిపింది. క‌ర్నాట‌క ట్రాన్స్‌ప‌రెన్సీ ఇన్ ప‌బ్లిక్ ప్రొక్యూర్మెంట్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ తీసుకురానున్నారు. 
 
కేటీపీపీ చ‌ట్టంలో క్యాట‌గిరీ 2బీ కింద రిజ‌ర్వేష‌న్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ప్ర‌క‌టించారు. క్యాట‌గిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్ట‌ర్లు ఉంటార‌ని తెలిపారు. క్యాట‌గిరీ 1 కింద ఎస్సీ, ఎస్టీలు, క్యాట‌గిరీ 2ఏ కింద వెనుక‌బ‌డిన త‌రగ‌తులు వారుంటారు.

కేటీపీపీ చ‌ట్టం ప్ర‌కారం క్యాట‌గిరీ 2బీ కింద ఉన్న ముస్లిం కాంట్రాక్ట‌ర్లు సుమారు రెండు కోట్ల రూపాయిల మేర ప్ర‌భుత్వ ప‌నులు చేసేందుకు అర్హులు అవుతారు. సీఎం సిద్ధ‌రామ‌య్య చేసిన ప్ర‌క‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తూ క‌ర్నాట‌క బీజేపీ ఆన్‌లైన్‌లో ఆందోళ‌న చేప‌ట్టింది. `హ‌లాల్ బ‌డ్జెట్’ అని పేర్కొంటూ సోష‌ల్ మీడియాలో ఆ పార్టీ కామెంట్ చేసింది.

ప్ర‌స్తుత అసెంబ్లీ సెష‌న్‌లో స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌న త‌ర్వాత‌ ముస్లిం కాంట్రాక్ట‌ర్ల కోటాను అమ‌లు చేస్తామ‌ని సీఎం సిద్ద‌రామ‌య్య తెలిపారు. గ్రామీణ ప్ర‌జ‌ల‌కు ఈ-ఖాతా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు కూడా సీఎం తెలిపారు. దీని కోసం పంచాయ‌తీరాజ్ శాఖ ఆమోదం తెలిపింద‌ని చెప్పారు.

ముస్లిం సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్‌ను రూపొందించారని, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు వంటి ఇతర అణగారిన వర్గాల అవసరాలను పట్టించుకోలేదని మండిపడుతూ బీజేపీ దీనిని “కుంభకోణం”గా అభివర్ణించింది కాంగ్రెస్ రాష్ట్ర వనరులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది.

అంబేద్కర్ దార్శనికత ప్రకారం రూపొందించబడిన భారత రాజ్యాంగం నిర్వచించిన ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) హక్కులను ఇది దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, దానిని అనుమతించకూడదని మాల్వియా వాదించారు. కాంగ్రెస్ పార్టీ చర్యలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఈ వర్గాల హక్కులను అణగదొక్కే వారి విస్తృత వ్యూహంలో భాగమని ఆయన ఆరోపించారు.