కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని కాంక్రీట్ జంగిల్ కానీయొద్దని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల కొండపై భవన నిర్మాణాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని టీటీడీ అధికారుల్ని ఆదేశించింది. కొండపై ఇలా వరుసగా అక్రమ నిర్మాణాలను అనుమతిస్తే కొంత కాలం తర్వాత అక్కడి అటవీప్రాంతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఇకపై ధార్మిక సంస్థలమని చెప్పుకొంటూ ఇష్టారాజ్యంగా తిరుమలలో నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది.
తిరుమలలో ఇష్టానుసారంగా ధార్మిక సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తిరుపతికి చెందిన మహేష్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ నిర్మాణాలు జరగకుండా టీటీడీ ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో కోరారు. ఇరుపక్షాల వాదనల్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం వినింది. హైకోర్టు ఓ మఠం చేపట్టిన అక్రమ నిర్మాణం విషయంలో ఉత్తర్వుల మేరకు ఇటీవల చర్యలు తీసుకున్న విషయాన్ని టీటీడీ తరఫున లాయర్ సుమంత్ హైకోర్టు ధర్మాసనానికి గుర్తు చేశారు.
ఇలా ఉండగా, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ తొక్కిసలాట నేపథ్యంలో మూడో దశ విచారణలో భాగంగా ఈనెల 14, 15, 16 తేదీల్లో న్యాయ విచారణ కమిషన్ జస్టిస్ సత్యనారాయ ణమూర్తి తిరుమలలో క్యూ లైన్ల నిర్వహణను కూడా పరిశీంచనున్నారు. ఈనెల 17వ తేదీ నుంచి తిరుపతిలో జరగనున్న విచారణకు నేరుగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామల రావు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజులకు ఇప్పటికే సమన్లుజారీ చేశారు.
కాగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఫిబ్రవరి 24న విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి బాధితులను విచారించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తిరుపతి కలెక్టరేట్ వేదికగా కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాణమూర్తి ఫిబ్రవరి 22న రెండో దశ విచారణ చేపట్టారు. 11 మందిని విచారించారు.
More Stories
గోదావరి జలాలపై కలిసి మాట్లాడుకొందాం
ప్రముఖ సాహితీవేత్త పులిచెర్ల సాంబశివరావు ఇక లేరు
భారత నావికాదళంలోకి ఐఎన్ఎస్ అర్నాల