
* నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా ర్యాలీ
ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ రాజధాని ఖాట్మండు వీధుల్లో వేలాది మంది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రాచరిక పాలన, హిందూ దేశాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పీపీ) నిర్వహించిన ర్యాలీలో మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లను కూడా ప్రదర్శించారు.
అయితే, నేపాల్ రాజకీయాలకూ, యూపీ సీఎంకూ ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? నేపాల్‌ను మళ్ళీ హిందూ దేశంగా మార్చాలని జ్ఞానేంద్ర షా చాలా కాలంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌ను సందర్శించిన సమయంలో యూపీ సీఎంతో భేటీ అయ్యి ప్రత్యేకంగా ముచ్చటించారు.
నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలు ఉన్నాయి. దీని తర్వాత రాచరిక పాలనకు యోగి తన పూర్తి మద్ధతు ప్రకటించారు. నేపాల్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి హిందూ రాచరికానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 2006లో చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం రాజు జ్ఞానేంద్ర పాలనకు ముగింపు పలికింది. అప్పటి నుంచి నేపాల్‌లో వామపక్షాలు పాలిస్తూ వస్తున్నాయి.
పుష్పకమల్ దహల్ ప్రచండ తర్వాత కే.పీ.శర్మ ఓలి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. అయితే, తాజాగా రాచరికం తిరిగి రావాలని కోరుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ఇటీవల మాజీ రాజు జ్ఞానేంద్ర షా పోఖారా నుండి ఖాట్మండు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటకు రాగానే షా మద్దతుదారులు అక్కడ భారీ ఊరేగింపు నిర్వహించారు.
ఈ ర్యాలీలోనే కొంతమంది యువకులు రాజా జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్, జాతీయ జెండా పోస్టర్లను చేత పట్టి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. ఇదిలా ఉంటే, యూపీ సీఎం యోగి ఫోటో ర్యాలీలో ప్రదర్శించడాన్ని ప్రధాన మంత్రి కేపీ ఓలి తప్పుపట్టారు.
ఇతర దేశాల నేతల చిత్రపటాలను ప్రదర్శించడంపై విమర్శలు రావడంతో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. తమ ఉద్యమానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రధాని కెపి ఓలి వర్గం ఈ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను ప్రదర్శించిందని ఆయన ఆరోపించారు. ప్రధాని ఓలి ముఖ్య సలహాదారు సూచనల మేరకు యోగి చిత్రాన్ని ప్రదర్శించారని ఆ ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ప్రధాని ఓలి ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ ఖండించారు.
More Stories
విద్యాశాఖను మూసివేసిన ట్రంప్
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి…85 మంది మృతి