
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఓవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో ఆ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. కీవ్పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడగా, ప్రతీకారంగా ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడికి దిగింది. దాదాపు 337 డ్రోన్లను కూల్చివేశామని రష్యా ప్రకటిచింది.
సోమవారం రాత్రి నుంచి రష్యాలో10 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడికి దిగిందని పుతిన్ సైన్యం పేర్కొంది. 337 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని వెల్లడించింది. అత్యధికంగా కుర్క్స్ ప్రాంతంలో 126, మాస్కో పరిధిలో 91 డ్రోన్లను కూల్చేసినట్లు సైన్యం వివరించింది.
ఈ దాడుల సమయంలో మాస్కోలోని రెండు విమానాశ్రయాల్లో రాకపోకలను నియంత్రించినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ ఒక భవనం పైకప్పును దెబ్బతిందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ చేపట్టిన అతి పెద్ద డ్రోన్ దాడి ఇదే అని మాస్కో మేయర్ తెలిపారు.
కమికేజ్ డ్రోన్లను ఉక్రెయిన్ వాడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ డ్రోన్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లగలవని ఇటీవల ఉక్రెయిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. సోమవారం డొమోడీడోవ్ ప్రాంతంలోని పార్కింగ్ పై జరిగిన దాడిలో 20 వాహనాలు డ్యామేజ్ అయ్యాయి.
అంతకుముందు ఉక్రెయిన్కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేసిందని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ వెల్లడించారు. తమపై బాలిస్టిక్ క్షిపణులు, బహుళ రాకెట్లను ప్రయోగించిందని తెలిపారు. వీటిని తమ దళాలు అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. కీవ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తమకు పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని అక్కడి ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ఇక, రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అటు అమెరికా, ఇటు ఐరోపా దశాలు మంగళవారం కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌తో అమెరికా చర్చలకు సిద్ధమైంది.
అమెరికా సాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు మాస్కోను నిలువరించేందుకు ఐరోపా దేశాలు సమావేశమవుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రభుత్వం ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు రష్యా ఆరోపించింది. యుద్ధంలో నష్టపోవడం వల్లే ఉక్రెయిన్ ఇలాంటి దాడులు చేస్తోందని పేర్కొన్నది. తాజా దాడిని ఉగ్రవాదంగానే భావిస్తున్నట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది.
More Stories
విద్యాశాఖను మూసివేసిన ట్రంప్
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి…85 మంది మృతి