
ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్–20 నగరాల జాబితాలో ఏకంగా 13 నగరాలు భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ‘ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’ నివేదిక విడుదలైంది. ఇందులో ప్రపంచంలో ఐదో అత్యంత కలుషిత దేశంగా భారత్ నిలిచింది.
కాలుష్య నగరాల్లో మేఘాలయలోని బైర్నిహాట్ అగ్రస్థానంలో ఉందని పేర్కొనగా, ప్రపంచంలోని అత్యంత కలుషితమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉందని నివేదిక స్పష్టం చేసింది. దీని ప్రకారం, 2023లో భారత్ ప్రపంచంలోనే మూడో అత్యంత కాలుష్య దేశంగా ఉండగా, 2024 నాటికి కాస్త మెరుగుపడి ఐదో స్థానానికి చేరుకుంది.
మన పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోని 4 నగరాలు, చైనాలోని ఒక నగరం కూడా ప్రపంచంలోని టాప్-20 కాలుష్య నగరాల జాబితాలో ఉన్నాయి. నివేదిక ప్రకారం, భారత్‌లో పీఎం2.5 సాంద్రత 2023లో క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములు ఉండగా, అది 2024లో 7 శాతం మేర తగ్గింది. అంటే సగటున క్యూబిక్ మీటర్‌కు 50.6 మైక్రోగ్రాములు తగ్గింది. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారతదేశంలోనే ఉండడం గమనార్హం.
నివేదిక ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింతగా పెరుగుతోంది. 2023లో పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 102.4 మైక్రోగ్రాములు ఉండగా, అది 2024లో క్యూబిక్ మీటర్‌కు 108.3 మైక్రోగ్రాములకు పెరిగింది.
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బర్నిహాట్ (ఇండియా), ఢిల్లీ(ఇండియా), కారాగాండా (కజకిస్థాన్), ముల్లాన్‌పూర్ (ఇండియా), లాహోర్ (పాక్), ఎంజామెనా (చాద్), ఫరీదాబాద్(ఇండియా), లోని (ఇండియా), న్యూఢిల్లీ(ఇండియా),ముల్తాన్ (పాక్), పెషావర్(పాక్), సియాల్‌కోట్(పాక్), గురుగ్రామ్ (ఇండియా), గంగానగర్(ఇండియా), హోటన్ (చైనా), గ్రేటర్ నోయిడా(ఇండియా), భీవండి (ఇండియా),ముజఫర్‌నగర్ (ఇండియా), హనుమాన్‌గఢ్(ఇండియా), నోయిడా(ఇండియా) ఉన్నాయి.
మొత్తంగా చూసుకుంటే, దాదాపు 35 శాతం భారతీయ నగరాల్లో వార్షిక పీఎం2.5 సాంద్రత స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాముల కంటే తక్కువ ఉండాలి. కానీ భారత్‌లో ఈ పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువగా పీఎం2.5 సాంద్రతలు ఉన్నాయి.
మేఘాలయ-అసోం సరిహద్దుల్లోని బైర్నిహాట్ పట్టణంలో చాలా డిస్టిలరీలు, ఇనుము, ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ఆ నగరం కాలుష్యకాసారం అవుతోంది. ఇక దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ఏడాది పొడవునా అధిక వాయు కాలుష్యంతో సతమతమవుతోంది. శీతాకాలంలో అయితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంటుంది. వాహన ఉద్గారాలకు తోడు, పంట వ్యర్థాలను తగులబెట్టడం, పటాకులు కాల్చడం సహా, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ఉద్గారాలు ఢిల్లీలోని గాలి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
ఈ వాయు కాలుష్యం వల్ల భారత్‌లో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మానవుల ఆయుర్దాయం 5.2 సంవత్సరాలు తగ్గుతోందని అంచనా. గతేడాది ప్రచురించిన లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ స్టడీ ప్రకారం, 2009-2019 మధ్యలో భారత్‌లో ఏటా దాదాపు 1.5 మిలియన్ మరణాలు పీఎం2.5 కాలుష్యం వల్లనే కలిగాయని తేలింది.
పీఎం2.5 అంటే 2.5 మైక్రాన్ల కంటే చిన్నగా ఉండే కణాలు. సింపుల్‌గా చెప్పాలంటే వాయు కాలుష్య కణాలు. ఇవి ఊపిరితిత్తుల్లోకి, రక్తప్రవాహంలోని ప్రవేశించి దీర్ఘకాలిక శ్వాస సమస్యలు, గుండె జబ్బులకు, క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత