టారిఫ్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న ట్రంప్

టారిఫ్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై యోగా గురువు, ఎఫ్ఎంసీసీ జెయింట్ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా మండిపడ్డారు. టారిఫ్ టెర్రరిజాన్ని ట్రంప్ ప్రోత్సహిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలు ఎంతైతే టారిఫ్ విధిస్తారో తామూ అంతే టారిఫ్ విధిస్తామంటూ ‘రెసిప్రోకల్ టారిఫ్‌’లను ట్రంప్ విధిస్తుండంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అమెరికా అధ్యక్షుడు సరికొత్త మేథో వలసరాజ్యం శకాన్ని సృష్టిస్తూ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ”ఇదొక సరికొత్త మేథో వలసరాజ్య శకం. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఆయన టారిఫ్ టెర్రరిజంలో ప్రపంచ రికార్డు సృష్టిస్తుంటారు. పేదలు, అభివృద్ధి చెందిన దేశాలను బెదిరిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుంటారు. ప్రపంచాన్ని కొత్త శకంలోకి తీసుకెళ్తుంటారు” అని ఆరోపించారు. 

ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో భారత్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. భారతదేశాన్ని పటిష్ట దేశంగా తీర్చిదిద్ది, ఇలాంటి విధ్వంసక శక్తులకు గట్టి జవాబిచ్చేందుకు భారతీయులంతా సమష్టిగా నిలబడాలని మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా రామ్‌దేవ్ బాబా పిలుపిచ్చారు. 

కొన్ని శక్తివంతమైన దేశాలు ప్రపంచాన్ని విధ్యంసం దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నందున భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. కాగా,  కాలిఫోర్నియాలోని హిందూ ఆలయాన్ని విధ్వంసం చేసిన ఘటనను రామ్‌దేవ్ బాబా ఖండించారు. ఈ తరహా మతపరమైన ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు భారత్ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. 

రెలిజియస్ టెర్రరిజంతో యావత్ ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, దీనికి అన్ని దేశాల అధిపతులు ఒక పరిష్కారం కనుగొనాలని పేర్కొంటూ ఈ దిశగా భారత్ తగిన చొరవ చూపించాలని ఆయన సూచించారు. మరోవంక,  మొఘల్ చక్రవరి ఔరంగబేబ్‌కు సంబంధించిన అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఎప్పుడూ భారత ప్రజల ఆరాధ్యనీయుడు కాదని స్పష్టం చేశారు.

”ఆయన దోపిడీల కుటుంబానికి చెందిన వాడు. బాబర్ కానీ ఆయన కుటుంబం కానీ భారత్ ను దోచుకునేందుకు వచ్చారు. వేలాదిమంది మన మహిళలను వాళ్లు చిత్రహింసలు పెట్టారు. వాళ్లు మన ఐడల్స్ కాదు. ఛత్రపతి శివాజీ మనకు ఆరాధ్యుడు” అని రాందేవ్ బాబా చెప్పారు.