`అభినవ అన్నమయ్య’ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి

`అభినవ అన్నమయ్య’ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి
సంగీత స్వరకర్త, శాస్త్రీయ సంగీత గాయకులు, టీటీడీ ఆస్థాన విద్వాంసుడు కళారత్న గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన1976లో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్ట్‌లో గాయకుడిగా చేరి 2006లో ఉద్యోగ విరమణ పొందారు. 
 
అన్నమయ్య కీర్తనలు ఆలపించడంలో స్వరపరచడంలో రికార్డు చేయడంలో పుస్తక ప్రచురణలో జీవితాన్ని అంకితం చేశారు. ఆయన సేవలకు గాననూ కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. శాస్త్రీయ సంగీత విద్వాంసుల్లో మంచి మానవీయ హృదయం వున్న మహా గాయక విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్.
 
జగడపు చనువుల జాతర కీర్తన ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. మహామహులు ఎందరో శాస్త్రీయ కచేరీలు చేసినా తెలుగునాట సంకీర్తనా యజ్ఞ ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత గరిమెళ్లకే దక్కుతుంది. భక్తి టీవీ హరి సంకీర్తన ద్వారా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. వేలాది వేదికలపై కచేరీలు చేశారు. 
 
300 కీర్తనలు నాన్‌స్టాప్‌గా పాడిన ఘనత గరిమెళ్లది. 600 పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి వెలుగులోకి తెచ్చారు. ఆరు వేలకు పైగా కచేరీలు చేశారు. సిలికానాంధ్ర సంస్థ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన లక్ష గళార్చనలో బాలకృష్ణ ప్రసాద్ ప్రధాన గాయకులు! ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు లో చోటు చేసుకుంది. 
 
బాలకృష్ణ ప్రసాద్ మంచి భక్తి గీత రచయిత. శ్రీవేంకటేశ్వర స్వామి చెంత సేవకులుగా ఉన్నప్పటికీ ఆయన స్వయాన హనుమాన్ భక్తులు. 21 ఆంజనేయ కృతులు రచించి స్వరపరచారు. వినాయకుడిపై 50 కృతులు రచించారు. వెయ్యికి పైగా కీర్తనలు రచించి స్వరపరచి జన బాహుళ్యం లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా, కంచి కామకోటి పీఠం, అహోబిల మఠం ఆస్థాన సంగీత విద్వాంసులుగా సేవలు అందించారు. ఆయన స్వరపరచిన సంకీర్తనలను అనేక పుస్తకాలుగా టీటీడీ ప్రచురించింది. భార్య రాధ, కుమారులు పవన్ కుమార్, అనిల్ కుమార్ శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితమై సేవలు అందిస్తున్నారు. 

రాజమండ్రి వాస్తవ్యులైన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ప్రముఖ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి శిష్యులు. తిరుపతిలో స్థిరపడి అన్నమయ్య అంశగా గుర్తింపు పొందారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్. జానకి మేనల్లుడు బాలకృష్ణ ప్రసాద్. సినిమా అవకాశాలు వచ్చినా శాస్త్రీయ సంగీతానికి, స్వామి వారి సేవకు అంకితమై జీవించారు.