1.35 లక్షల మంది భారతీయ యువతకు బహిష్కరణ ముప్పు!

1.35 లక్షల మంది భారతీయ యువతకు బహిష్కరణ ముప్పు!

అమెరికాకు డిపెండెంట్‌ వీసాపై వెళ్లిన వేలాది మంది భవిష్యత్తు ట్రంప్‌ కఠిన వీసా నిబంధనలతో అగమ్యగోచరంగా మారింది. హెచ్‌-1బీ వీసాదారుల డిపెండెన్స్ కోసం జారీ చేసే హెచ్‌-4 వీసాపై వచ్చిన వేలాది మైనర్లకు 21 ఏళ్లు నిండుతుండటం వల్ల వారు చిక్కుల్లో పడ్డారు. 

ప్రస్తుత ఇమ్మిగ్రేషన్‌ చట్టాల ప్రకారం హెచ్‌-4 వీసాపై అమెరికాకు వచ్చి 21 ఏళ్ల నిండిన వారు డిపెండెంట్‌ వీసా అర్హత కోల్పోతారు. కొత్త వీసా పునరుద్ధరణకు రెండేళ్ల గడువు ఉంటుంది. డిపెండెంట్‌ వీసా అర్హత కోల్పోయిన వారు, సరైన ధృవపత్రాలు లేని యువతకు డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డిఎసిఎ) దేశ బహిష్కరణ నుంచి తాత్కాలికంగా ఈ రెండేళ్ల రక్షణ అందిస్తుంది. 

అయితే ఇది చట్ట విరుద్ధమని, దీని కింద వర్క్‌ పర్మిట్‌ పొందలేరని టెక్సాస్‌లోని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఫలితంగా భారతీయ యువత భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.  వీసా గడువు ముగిసే వారు ఉన్నత చదువుల కోసం ఎఫ్‌-1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. 

అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదైతే స్కాలర్‌షిప్‌ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతామనే ఆందోళన యువతలో నెలకొంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం 2023 మార్చి నాటికి 1.34లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులకు గ్రీన్‌కార్డు లభించేలోపు డిపెండెంట్‌ వీసా హోదా కోల్పోయింటారని అంచనా వేసింది.

డీఏసీఏ నిబంధన కూడా లేకపోవడంతో ఇప్పుడు అమెరికాలోని భారతీయ యువత తప్పనిసరిగా స్వదేశానికో లేదా మరో ఇతర దేశానికో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 2026 ఆర్థిక సంవత్సరం కోసం యూఎస్‌సీఐఎస్‌ ఇటీవల హెచ్‌1బీ వీసాల రిజిస్ట్రేషన్‌ను ప్రకటించింది. ఈ ప్రక్రియ ఈ నెల 7 నుంచి 24వరకు కొనసాగనుంది.

అమెరికాలో శాశ్వత పౌరసత్వం లభించడం కోసం దరఖాస్తు దారులకు 12 నుంచి 100 సంవత్సరాల సమయం పడుతోందని లెక్కగట్టింది.   ఈ నేపథ్యంలో సరళమైన వీసా విధానాలున్న కెనడా, యూకే తదితర దేశాలకు వలస వెళ్లేందుకు పలువురు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో బ్యాక్‌లాగ్‌ భారీగా ఉండటం కూడా భారతీయ వలసదారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.