కేరళలో బిజెపికి మద్దతుగా క్రైస్తవుల `కాసా’ రాజకీయ పార్టీ

కేరళలో బిజెపికి మద్దతుగా క్రైస్తవుల `కాసా’ రాజకీయ పార్టీ
 
* 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు సరికొత్త పరిణామం
 
కేరళలోని 17 క్రైస్తవ వర్గాల మద్దతు ఉందని భావిస్తున్న  క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ (కాసా) “పూర్తిగా జాతీయవాద” దృక్పథంతో,  భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉండే ఓ రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు దాని వ్యవస్థాపకులలో ఒకరు తెలిపారు.
 
“మా ప్రయత్నం ఒక మితవాద జాతీయ పార్టీని స్థాపించడమే. అటువంటి రాజకీయ శక్తికి ఆమోదయోగ్యతను కనుగొనడానికి మేము అధ్యయనాలు నిర్వహించాము. కేరళలో అటువంటి పార్టీకి అవకాశం ఉందని మేము కనుగొన్నాము” అని కాసా రాష్ట్ర అధ్యక్షుడు కెవిన్ పీటర్ వెల్లడించారు. కెవిన్ మరో ఐదుగురితో కలిసి 2018లో కాసాను స్థాపించారు. 2019లో దానిని ఒక సొసైటీగా నమోదు చేశారు. 
 
తరచుగా ఇస్లామోఫోబిక్ అని పిలువబడే కాసా, పౌరసత్వ సవరణ చట్టం, ‘లవ్ జిహాద్’, ట్రిపుల్ తలాక్ వంటి వివిధ అంశాలపై బిజెపి అనుకూల వైఖరి వ్యక్తపరుస్తూ వస్తున్నది. 2016లో తన ఏకైక కుమార్తె ముస్లింను వివాహం చేసుకోవడానికి కుటుంబాన్ని విడిచిపెట్టిన తర్వాత తాను ‘లవ్ జిహాద్’ బాధితురాలిని అని కెవిన్ చెప్పారు. అప్పటి నుండి ఆమె నుండి ఎటువంటి సమాచారం లేదు.
 
క్రైస్తవ పార్టీగా పరిగణించబడే కేరళ కాంగ్రెస్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన ఔచిత్యాన్ని కోల్పోయిందని కాసా భావిస్తోంది. “కేరళ కాంగ్రెస్ చాలా బలహీనంగా మారింది. దాని భవిష్యత్తు అంధకారంగా ఉంది. పార్టీ తన శక్తిని నిలుపుకోవడానికి అవకాశం లేదు” అని కెవిన్ స్పష్టంచేశారు. కాసా ఓ రాజకీయ పక్షంగా రాబోయే సంవత్సరాలలో నెమ్మదిగా, స్థిరంగా నిలదొక్కుకునేందుకు ఇదే సమయం అని భావిస్తున్నారు. 
 
ఓ  ప్రణాళిక ప్రకారం, కాసా స్వతంత్రంగా కొనసాగుతుంది. ఏర్పడే కొత్త రాజకీయ పార్టీ ఓ ప్రత్యేక రాజకీయ సంస్థగా ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చివర్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, స్వతంత్రులుగా ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారిని లేదా జాతీయవాదం కోసం నిలబడే పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి కాసా ప్రోత్సహిస్తుంది.
 
“2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీని ప్రారంభించడమే మా ప్రయత్నం” అని కెవిన్ తెలిపారు. గతంలో క్రైస్తవ విశ్వాసులను చర్చి నడిపించేదని, కానీ గత ఎన్నికల తర్వాత, ఆలోచనలో మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. బిజెపి, దాని మిత్ర పక్షాలకు మద్దతు ఇవ్వడం విస్తృత విధానం అని కెవిన్ పేర్కొన్నారు.
 
“మా సిద్ధాంతంతో పొత్తు పెట్టుకునే అభ్యర్థుల విజయాన్ని నిర్ధారించడం లేదా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే వారిని ఓడించడం మా లక్ష్యం” అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరొక నాయకుడు తెలిపారు. కాసా వెబ్‌సైట్ ప్రకారం, సంస్థ నినాదం “‘నా దేశం, నా నమ్మకాలు’. అంటే “మేము మా నమ్మకాలను అలాగే మా భూమిని విలువైనదిగా భావిస్తాము.” 
 
కాసా 120 నియోజకవర్గాలలో కమిటీలను ఏర్పాటు చేస్తోందని, మొత్తం 22,000 మంది సభ్యులను కలిగి ఉందని, ఎక్కువగా మధ్య, ఉత్తర కేరళలో ఉందని కెవిన్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందిస్తామని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. “మేము ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తాము. ఈ కమిటీలు కొద్దిసేపటిలో రాజకీయ సంస్థగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి” అని మరొక నేత చెప్పారు.
 
ప్రపంచవ్యాప్తంగా మితవాద రాజకీయాలు పెరుగుతున్నాయని, అది జర్మనీ అయినా లేదా అమెరికా అయినా ఆ విధంగా జరుగుతున్నదని ఆ నేత గుర్తు చేశారు. “నిజం చెప్పాలంటే, ఇక్కడ అలాంటి రాజకీయాలకు అవకాశం ఉంది” అని స్పష్టం చేశారు. కాసా చాలా ఐరోపా దేశాలు, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మలయాళీ క్రైస్తవులు సభ్యులుగా యూనిట్లను ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. 
 
“కాసా ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ జాతీయవాదం కోసం నిలబడే హిందువులు, ముస్లింలను చేర్చుకుంటుంది” అని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాసా  తక్కువ వ్యవధిలో ప్రజా అవగాహనలో క్రైస్తవ సంస్థగా ఉద్భవించినందున క్రైస్తవ గుర్తింపు అలాగే ఉంటుందని పేర్కొన్నారు. మితవాద కేరళ కాంగ్రెస్ ఔచిత్యాన్ని కోల్పోయిందని, కొత్త మితవాద పార్టీతో ఆ రాజకీయ స్థలాన్ని నింపాలని కాసా లక్ష్యంగా పెట్టుకుంది.