టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ స్పోర్ట్స్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షామా మహ్మద్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. రోహిత్ శర్మ ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులు, బీజేపీ నాయకులు షామా వ్యా్ఖ్యలను తప్పుపడుతున్నారు. రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి ఆటగాడని, ఆయన గురించి బాడీ షేమింగ్ చేయడం, క్రికెట్‌లో ఆయన సాధించిన ఘనతలను తక్కువ చేసి మాట్లాడటం సరైనదిగా కాదని అంటున్నారు.
రోహిత్ శర్మ లావుగా ఉన్నాడంటూ పోస్ట్ చేసిన షామా మహ్మద్ పై విమర్శల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ చాలా లావుగా ఉంటాడని, ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడని, సచిన్, ద్రవిడ్, గంగూలీ, కోహ్లీ, ధోనీలతో పోల్చితే ఆయన జస్ట్ యావరేజ్ ఆటగాడని ఆమె వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్‌లుగా బాధ్యతలు నిర్వహించిన వారిలో అంతగా ఆకట్టుకోలేని కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమేనని షామా కామెంట్ చేశారు. తాజాగా దుబాయి వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహత్ ఆటతీరుపై ఆమె ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
“రోహిత్ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిట్‌నెస్ ఉండదు. ఏదో అదృష్టం కొద్దీ రోహిత్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్. సచిన్, కోహిల్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు” అంటూ షామా ఎక్స్ పోస్టులో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకురాలు తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ కామెంట్స్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. అయినా షామా మహ్మద్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం సంచలనం రేపింది.
రోహిత్ శర్మ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో షామాపై విమర్శలు గుప్పిస్తున్నారు. షామా మహ్మద్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా కావడంతో ఆమె వ్యాఖ్యలపై రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై, రాహుల్‌గాంధీపై కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, షామా వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు. “భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది? అయినా మీరు రాహుల్‌గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా?” అంటూ ఎద్దెవా చేశారు. దీనిపై షామా స్పందిస్తూ ‘ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. దాంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. రోహిత్ శర్మపై షామా మహ్మద్ పోస్టుతో తమ పార్టీకి సంబంధం లేదని తెలిపింది. ఆ వివాదాస్పద పోస్టును డిలీట్ చేయాలని ఆమెను ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టాడు.
పార్టీ ప్రకటన చేసిన కాసేపటికే షామా మహ్మద్ తన పోస్టును డిలీట్ చేశారు. అయితే ఆమె ఇంతవరకు రోహిత్ శర్మకు క్షమాపణ తెలియజేయలేదు. కాగా, జెయూకు చెందిన సీనియర్ నాయకుడు కేసీ త్యాగి కూడా షామా మహ్మద్ కామెంట్స్‌పై స్పందించారు. రోహిత్ శర్మపై షామా మహ్మద్ కామెంట్స్ విషయాన్ని ఓ మీడియా సంస్థ కేసీ త్యాగి దగ్గర ప్రస్తావించగా ఆయన తన స్పందన తెలియజేశారు.
కాంగ్రెస్ మహిళా అధికార ప్రతినిధి షామా మహ్మద్ ఆ వ్యాఖ్యలు చేసేముందు రోహిత్ శర్మ సాధించిన భారీ స్కోర్లను చూడాల్సిందని ఆయన హితవు చెప్పారు. అయినా రాజకీయ నాయకులు క్రీడలకు సంబంధించిన విషయాల్లో జోక్యాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

More Stories
ప్రధానిని `దేశ ద్రోహి’ అన్నారని ఎస్పీ ఎంపీపై కేసు!
రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం
నీట్ యూజీ 2026 పేపర్ లీక్?.. పరీక్ష రద్దు