తన పేరును ఈ20 పెట్రోల్ కార్యక్రమంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారమైన పోస్టులు, డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ న్యాయపోరాటానికి దిగారు. తనతోపాటు కుటుంబసభ్యులు ఈ20 విధానంవల్ల లబ్ధిపొందినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మెటాతోపాటు ఇతర సోషల్ మీడియా వేదికలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ దావా వేయడానికి హైకోర్టు అనుమతిచ్చింది.
ఈ20 ఇథనాల్ కార్యక్రమంవల్ల తన కుటుంబం లాభపడిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందని వివరించారు. ఈ పోస్టులు డీప్‌ఫేక్ కంటెంట్ ముంబైలో కూడా అందుబాటులో ఉండటంతో బాంబే హైకోర్టుకు ఈ కేసును విచారించే అధికారం ఉందని గడ్కరీ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ వాదనలు విన్న జస్టిస్ అభయ్ అహుజా సివిల్ సూట్ దాఖలు చేసేందుకు అనుమతి మంజూరు చేశారు. ఈ పరిణామానికి రెండు వారాలముందు నాగ్‌పూర్‌లోనూ ఇదే అంశంపై కేసు నమోదైంది. ఈ20 కార్యక్రమానికి సంబంధించి కేంద్రమంత్రిపై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో యూట్యూబర్, రాజకీయ నాయకుడు మనీష్ కశ్యప్‌తోపాటు ‘దేశీ బాయ్స్’ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా హర్షిత్ రాఠీ పేర్లు ఉన్నాయి.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రియే బాధ్యులని పేర్కొంటూ, గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు, డీప్‌ఫేక్ కంటెంట్‌ను వైరల్ చేశారని గడ్కరీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలలో రవ్వంత కూడా నిజం లేదని, అవి దురుద్దేశపూరితమైనవని, పరువు నష్టం కలిగించేవని, అవాస్తవమైనవని కూడా ఆ పిటిషన్లో తెలిపారు.
ప్రతిపాదిత దావాలో, పోస్టులు, ట్వీట్లు, రీల్స్, వీడియోలు, ఇతర సామగ్రితో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పరువు నష్టం కలిగించేవిగా ఆరోపించబడుతున్న, ఏఐ రూపొందించిన “డీప్‌ఫేక్” కంటెంట్ ప్రచురణ,వ్యాప్తికి వ్యతిరేకంగా శాశ్వత, తప్పనిసరి నిషేధాజ్ఞలు జారీ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
అధిక ఇథనాల్ మిశ్రమం కొన్ని వాహనాలలో పనితీరు సమస్యలకు, నష్టానికి కారణమైందని సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఇథనాల్ మిశ్రమ ఇంధనం, ముఖ్యంగా ఈ20 పెట్రోల్‌పై ప్రజల పరిశీలన పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, వాహన తయారీదారులు, ప్రభుత్వ మద్దతుగల పరీక్షా సంస్థలు, ఈ20 కోసం ధృవీకరించబడిన వాహనాలు ఆ ఇంధనాన్ని సురక్షితంగా ఉపయోగించేలా రూపొందించినట్లు, పరీక్షించినట్లు స్పష్టం చేశాయి.
వాహన సమస్యలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక కేసులను ఇథనాల్ మిశ్రమం వల్ల కాకుండా, ఇంధన కాలుష్యం, నిర్వహణ సంబంధిత ఆందోళనల వంటి కారణాలకు ఆపాదించాయి. ముడి చమురు దిగుమతులపై దేశ ఆధారపడటాన్ని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, చెరకు, ధాన్యం ఆధారిత ముడి పదార్థాల నుండి ఇథనాల్ దేశీయ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం వంటి తన విస్తృత వ్యూహంలో భాగంగా కేంద్రం పెట్రోల్‌లో అధిక ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తోంది.

More Stories
భారత ఎయిర్‌బేసెస్‌కు దగ్గరలో 11 చైనా ఫైటర్ జెట్లు
మతం మారితే ఎస్సీ హోదా పోవడం ఖాయం
అయోధ్య విరాళాల చోరీలో రెండు వారాల్లో నివేదిక… సుప్రీం ఆదేశం