అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలో `సెక్స్’ ప్రకంపనలు

అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలో `సెక్స్’ ప్రకంపనలు

అగ్ర రాజ్యాన్ని మరో సెక్స్‌ కుంభకోణం కుదిపేస్తోంది. ఎన్‌ఎస్‌ఎ (నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ)కి చెందిన ఇంటెలిజెన్స్‌ సిబ్బంది తమ సంస్థకు చెందిన ఇంటెలింకె అనే మెసేజింగ్‌ యాప్‌ను ఉపయోంచుకుని అందులో చాట్‌ రూమ్‌ను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ చాట్‌రూమ్‌లో వారందరూ లింగ మార్పిడి విధానాలు, విచ్చలవిడి లైంగిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారని తెలుస్తోంది. 

దీనిపై అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ సంస్థ డైరెక్టర్‌ తులసి గబ్బార్డ్‌ ఒక ఉత్తర్వును జారీ చేశారు. ఈ చాట్‌ రూమ్‌లో పాల్గని అసభ్యకరమైన, అభ్యంతరకరమైన, లైంగిక దోపిడీలకు సంబంధించి చర్చలు జరిపిన, సందేశాలు పంపిన వారిని నిఘా వర్గాలు గుర్తించాయని తెలిపారు. వారికి సంబంధించి ఒక మెమోను కూడా జారీ చేసినట్లు ఆమె ఎక్స్‌ పోస్టులో ధృవీకరించారు.

ఎన్‌ఎస్‌ఎకి చెందిన ఇంటెలింక్‌ మెసేజింగ్‌ యాప్‌లోని చాట్‌ లాగ్‌లను మన్‌హటన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు సంపాదించారు. ఈ రికార్డులను పరిశీలించినట్లయితే అనేక నిఘా సంస్థలకు చెందిన సిబ్బంది ఏదో ఒక రీతిలో అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారని తెలుస్తోందని ఎన్‌ఎస్‌ఎ వర్గాలు తెలిపాయి.

ఇటువంటి అనైతిక వ్యవహార శైలికి పాల్పడ్డారని అనుమానిస్తున్న ఉద్యోగులు లింగ మార్పిడి శస్త్రచికిత్స, వెంట్రుకల తొలగింపు, కృత్రిమ జననాంగాల ఏర్పాటు, హార్మోన్‌ చికిత్స, విచ్చలవిడి లైంగిక సంబంధాలు వంటి అంశాలకు సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు. చర్చించుకున్నారని ఫాక్స్‌ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది. 

ఇందులో రక్షణ నిఘా సంస్థ, అమెరికా నావికా నిఘా సంస్థ, ఎన్‌ఎస్‌ఎలతో సహా పలు సంస్థలు వున్నాయి. ఎంప్లాయి రీసోర్స్‌ గ్రూపుల్లో ఈ సందేశాలు వెళ్ళాయి. ఈ గ్రూపులను కార్యకర్తలు హైజాక్‌ చేశారు. ప్రివిలేజ్‌, అలై అవేర్‌నెస్‌, ప్రైడ్‌, ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ ఇంక్లూజన్‌ వంటి శీర్షికలతో సమావేశాలు నిర్వహిస్తూ వీరు రోజంతా గడిపేసేవారు.

ఆ చర్చలకు సంబంధించిన రికార్డులను తాము సంపాదించామని మన్‌హటన్‌ పరిశోధకులు క్రిస్టోఫర్‌ రూఫో, హన్నా గాస్‌మన్‌లు తమ నివేదికలో వెల్లడించారు. ఈ చర్చలు, సందేశాలు ఇవన్నీ కూడా రెండేళ్ళనాటివి. సెక్స్‌, విచ్చలవిడి లైంగిక సంబంధాలు, కౌగిలింతలు వంటి వాటి గురించి వారు అందులో చర్చించారని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎ నాయకత్వం వీరికి ఇలా చేయడంలో పూర్తిగా మద్దతిచ్చేదని ఆ నివేదిక పేర్కొంది.

సంస్థ నిర్వహించే మెసేజింగ్‌ యాప్‌ను ఇలా దుర్వినియోగం చేయడంపై తాము చురుకుగా దర్యాప్తు జరుపుతున్నామని ఎన్‌ఎస్‌ఎ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఈ ఆరోపణలను తాము తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఒకవేళ ఇవన్నీ నిజమని తేలినట్లైతే దీర్ఘకాలంగా వున్న ఇంటెలిలిజెన్స్‌ కమ్యూనిటీ విధానాన్ని వారు తీవ్రంగా ఉల్లంఘించినట్లే అవుతుందని ఎన్‌ఎస్‌ఎ ప్రతినిధి వ్యాఖ్యానించారు. 

అమెరికా ప్రభుత్వ కంప్యూటర్లకు యాక్సెస్‌ వున్న వారిని వారిని ఇంటెలిజెన్స్‌ కమ్యూనిటీ బాగా విశ్వసిస్తుంది. మా పనిని నియంత్రించే అన్ని చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి వుండాలని మేం కోరుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు.