ప్రశ్నించే మీడియా సంస్థలకు వైట్‌హౌస్‌లోకి ప్రవేశం లేదు

ప్రశ్నించే మీడియా సంస్థలకు  వైట్‌హౌస్‌లోకి ప్రవేశం లేదు

రెండో పదవీ కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదటి కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కవరేజీకి కొన్ని మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి అనుమతించలేదు. మీడియా కవరేజీపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకువచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

అయితే ట్రంప్‌ విధానాలను విమర్శిస్తూ కథనాలను రాసిన మీడియా సంస్థలను, ప్రశ్నించే మీడియా ప్రతినిధులను ఉద్దేశపూర్వకంగానే అనుమతించలేదన్న విమర్శలు వస్తున్నాయి. రాయిటర్స్‌, అసోసియేటెడ్‌ ప్రెస్‌, హఫ్‌పోస్ట్‌, జర్మనీ వార్తాపత్రిక అయిన డెర్‌ తెగస్పిగల్‌లకు చెందిన విలేకర్లను, ఫోటోగ్రాఫర్లను అనుమతించలేదు. 

కేవలం ఎబిసి, న్యూస్‌మాక్స్‌, ది బ్లేజ్‌, బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌, ఎన్‌పిఆర్‌, యాక్సియోస్‌లకు చెందిన వారిని మాత్రమే అనుమతించారు. ఓవల్‌ ఆఫీసు వంటి చిన్న చిన్న ప్రదేశాల్లో నిర్వహించే పత్రికా సమావేశాలకు ఎవరెవరినీ పిలవాలనే అంశంపై వైట్‌హౌస్‌ నిర్ణయం తీసుకుంటుందని మంగళవారం ట్రంప్‌ ప్రభుత్వం వెల్లడించింది. 

సాంప్రదాయ మీడియా సంస్థలను ట్రంప్‌ రోజువారీ కార్యక్రమాల కవరేజికి అనుమతిస్తామని వైట్‌హౌస్‌ పత్రికా కార్యదర్శి కెరొలిన్‌ లెవిట్‌ తెలిపారు. కాగా ఈ చర్యను ఎపి, బ్లూమ్‌బెర్గ్‌, రాయిటర్స్‌ మీడియా సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు మూడు సంస్థలు ఒక ప్రకటన జారీ చేశాయి. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం స్వేచ్ఛాయుతంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొన్నాయి. 

పత్రికా స్వేచ్ఛను ఇది దారుణంగా ఉల్లంఘించడమేనని హఫ్‌పోస్ట్‌ పేర్కొంది. రాజకీయ వైఖరులతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల పాఠకులకు సకాలంలో, కచ్చితమైన వార్తలను అందించడానికే తాము కృషి చేస్తూ వుంటామని, అటువంటి ఈ చర్యలు సముచితం కాదని పేర్కొన్నాయి.

కెనడా, మెక్సికోలపై అనుకున్న ప్రకారమే ఏప్రిల్‌ 2 నుండి 25శాతం టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ట్రంప్‌ చెప్పారు. ఆ రెండు దేశాల సరిహద్దుల నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు. అయితే అంత మాత్రాన ఆ దేశాలపై సుంకాలు విధించకుండా ఆగేది లేదని స్పష్టం చేశారు. 

ఏప్రిల్‌ 2 నుండి చాలా అద్భుతాలు మీరు చూడబోతు న్నారని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సరిహద్దుల గుండా అక్రమంగా లోపలకు ప్రవేశించేవారు 90శాతం వరకు క్షీణిస్తే టారిఫ్‌లకు విరామం ప్రకటిస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించారు. టారిఫ్‌లను ఆపేది లేదని తేల్చి చెప్పారు. మెక్సికో ఆర్థిక వ్యవహారాల శాఖ దీనిపై వ్యాఖ్యానించడానికి తిరస్కరించగా, అవసరమనుకుంటే ఇయు సరైన రీతిలో స్పందిస్తుందని ఫ్రెంచ్‌ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.