ఏపీలో రాజకీయ వివాదాంశంగా మారిన `ప్రతిపక్ష హోదా’

ఏపీలో రాజకీయ వివాదాంశంగా మారిన `ప్రతిపక్ష హోదా’
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా అంశం రాజకీయ వివాదాంశంగా మారింది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేయడంతో ఈ అంశం కలకలం రేపుతోంది. అయితే, నిబంధనల ప్రకారం 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా సాధ్యం అవుతుందని అంటూ వైసిపి అభ్యర్ధనను అధికార పక్షం తిరస్కరించింది.
 
స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహితం ఈ విషయమై తన వైఖరిని స్పష్టం చేశారు. ఆ పేరుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వైసిపి సభ్యులు ఉండటంతో మొత్తం అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ముఖ్యమంత్రికి కేటాయించిన సమయం తనకు కూడా కేటాయించాలని జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. అయితే, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు ఎక్కువగా నిబంధనల కన్నా సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి.
 
మన దేశంలో అధికార, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన చర్చల పట్ల ఆసక్తి చూపడం లేదు. పరస్పరం వ్యక్తిగత విమర్శలకు దిగడం, సమావేశాలు జరగకుండా అధికార పక్ష సభ్యులే ఆటంకాలు సృష్టించడం ఆనవాయితీగా వాస్తు వస్తున్నది. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి సహితం అదేవిధంగా వ్యవహరించారు. ఆ నాడు తన కుటుంభం సభ్యులపై అసభ్యకర వాఖ్యలు సభలో చేశారని ఆవేదనతో సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉంటె, ఆయనను సభకు తీసుకొచ్చే ప్రయత్నం అధికార పక్షం నుండి జరగలేదు.
 
అదే బాటలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశాలకు దూరంగా ఉంటె ఆయనను సభకు రప్పించే చొరువను అధికార పక్షాలు ప్రదర్శించడం లేదు. ప్రతిపక్షాల ఉనికి పట్ల అధికార పక్షంలో కనిపిస్తున్న అసహనం ఇటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని చెబుతున్నారని, అది ప్రజలు ఇవ్వాలని, ప్రభుత్వం కాదని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సహాయతను వ్యక్తం చేశారు. 
 
అసలు ఏపీలో ప్రతిపక్షం అనేది లేదని, ప్రజలు అందుకు అవకాశం ఇవ్వలేదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ కు విలువ ఇవ్వని పార్టీకి అసెంబ్లీలోకి వచ్చే అర్హత లేదంటూ వైసీపీ సభ్యులు కావాలనే రాద్దాంతం చేసి గవర్నర్ ప్రసంగ ప్రతులను చించివేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు చక్కని నిదర్శనమే వారికి వచ్చిన 11 సీట్లు అంటూ పవన్ కళ్యాణ్ మరో మారు అసెంబ్లీలో వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

ఇలాఉంటె, ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ డా. సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేయడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పిటిషన్‌పై మార్చి 12న విచారణ జరగనుందని ఆయన వెల్లడించారు. . వైసీపీకు అసెంబ్లీలో తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ తదితర ప్రతిపక్ష పార్టీలతో పోల్చితే విపక్షంగా ఉండటమే సరైన న్యాయం అని తెలిపారు.
 
ప్రజలిచ్చిన బాధ్యతను జగన్ మర్చిపోవడం సరికాదని, అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను లేవనెత్తాలని అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ డి. పురందేశ్వరి హితవు చెప్పారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిన విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసని అంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు కోసం జగన్ మాట్లాడకపోవటం, హాజరు కోసం వెళ్ళటం సిగ్గుచేటు అంటూ విమర్శించారు.
 
ప్రతిపక్ష గుర్తింపు అంశంలో పవన్‌కల్యాణ్‌ అవగాహనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన ప్రతిపక్షంగా ఉంటామంటే తమకు అభ్యంతరం లేదని అంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వైసిపికి 40 శాతం ఓట్లు వచ్చినా, జనసేనకు ఆరుశాతం ఓట్లు వచ్చినా సీట్లు ఎక్కువ వచ్చినందున సీట్ల ప్రకారమే ప్రాతినిధ్యం ఉంటుందని తాము అంగీకరిస్తున్నామని చెప్పారు.
అయితే, శాసనసభలో ప్రస్తుతం మూడు పక్షాలు అధికారపక్షంగా ఉన్నాయని, మిగిలింది వైసిపి గనుక ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని చెప్పారు. వైసిపి పక్షంగా ఏమి చేయాలో తమకు తెలుసని, ఒకరు చెబితే నేర్చుకోవాల్సిన అవసరం లేదని అంటూ ఎదురు దాడికి దిగారు.