
ప్రపంచానికి జెనరిక్ ఔషధాలు అందించడంలో ముందువరుసలో ఉన్న భారత ఫార్మా రంగం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ఇన్నోవేషన్‌పై అధికంగా పెట్టుబడులు పెట్టాలని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ సూచించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో మంగళవారం ప్రధానోపన్యాసం ఇస్తూ ప్రస్తుతం 5,000 కోట్ల డాలర్లున్న (రూ.4.3 లక్షల కోట్లు) భారత ఫార్మా రంగం 2047 నాటికి 50,000 కోట్ల డాలర్లకు (రూ.43 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా అని చెప్పారు.
ఫార్మా ఎగుమతులు 2019 నాటికి 1,900 కోట్ల డాలర్లుండగా (రూ.1.63 లక్షల కోట్లు) 2024 నాటికి 2,800 కోట్ల డాలర్లకు (రూ.2.41 లక్షల కోట్లు) చేరాయని తెలిపారు. ఔషధ పరిశోధన, ఉత్పత్తిలో భారతదేశ సామర్థ్యాలేమిటన్నది కరోనా సమయంలో ప్రపంచానికి తెలిసిందని ఆయన చెప్పారు. ఔషధాల ఉత్పత్తిలో పరిమాణపరంగా మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలోను, విలువ పరంగా 12వ స్థానంలోను నిలుస్తోందని తెలిపారు.
అమెరికాలో వినియోగించే చేసే ప్రతి మూడు ఔషధాల్లో ఒకటి, బ్రిటన్‌లో ప్రతి నాలుగింటిలోనూ ఒకటి భారత్‌లో ఉత్పత్తి అవుతున్నవేన కాంత్ చెప్పారు.
ప్రపంచంలో నాన్ కమ్యూనికబుల్ వ్యాధు లు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మన ఔషధ కంపెనీలు బయోలాజికల్స్, బయో సిమిలర్స్‌పై దృష్టి సారించాలని కాంత్ సూచించారు. 2030 నాటికి ఈ వ్యాధులు మరింతగా విజృంభిస్తాయన్న అంచనాల నడుమ మన ఫార్మా కంపెనీలకు చక్కని వృద్ధి అవకాశాలున్న ఈ విభాగంపై దృష్టి సారించాలని సూచించారు.
మన ఫార్మా కంపెనీలు కేవలం తయారీదారులుగా కాకుండా ఇన్నోవేటర్లుగా ఎదగాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. అయితే ఇలాంటి పెట్టుబడుల్లో రిస్క్ అధికంగా ఉంటుందంటూ, ఇందుకు కంపెనీలు ముందుకు రావాలంటే అభివృద్ధి దశలోని ఔషధాలు, ఆర్ అండ్ డీ వ్యయాలపై ప్రభుత్వం తగినన్ని ప్రోత్సాహకాలివ్వడం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
డిస్కవరీ ఆధారిత ఇన్నోవేషన్‌లో కార్పొరేట్ పెట్టుబడులకు జీ ఎస్ టీ మినహాయింపులు కల్పించే విషయం కూడా పరిశీలించాలని సూచించారు. అలాగే ఈ తరహా ఇన్నోవేషన్‌కు అనుకూల వాతావరణం కల్పించడం కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నియంత్రణలు మరింతగా సడలించాలని, అనవసరమైన నిబంధనలు రద్దు చేసి తద్వారా నియంత్రణ యంత్రాంగాన్ని పరిశ్రమకు సహాయకారిగా ఉండేలా చూడాలని ఆయన సూచించారు.
బయో ఏషియా సదస్సులో ఈ అంశాలన్నింటినీ సమూలంగా చర్చించి తగు సూచనలతో ముందుకు వచ్చినట్టయితే ఇన్నోవేషన్‌కు అనుకూలమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవచ్చని కాంత్ చెప్పారు.ఇన్నోవేషన్ అత్యంత రిస్క్‌తో కూడుకున్న అంశమని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కో చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. 1994లో డ్రగ్ డిస్కవరీలో ప్రవేశించిన తాము 30 సంవత్సరాల పాటు శ్రమపడినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని చెప్పారు. సీఈఓ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్ విభాగంలో కంపెనీలు అధికంగా పెట్టుబడులు పెట్టాలంటే ఆ విభాగంతో ముడిపడి ఉన్న రిస్క్‌లకు సంసిద్ధమై నిధులందించే వెంచర్ క్యాపిటలిస్టులు రావడం కూడా అవసరమని పేర్కొన్నారు.
చైనాతో పోల్చితే మన ఇన్నోవేషన్ వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉన్నదని ప్రసాద్ చెప్పారు. కేవలం దశాబ్ది కాలంలో ఇన్నోవేషన్‌లో చైనా ప్రపంచంలో రెండో స్థానానికి ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. చైనా అనుసరిస్తున్న సానుకూల విధానాలే అందుకు కారణమని ప్రసాద్ చెప్పారు.
More Stories
హెచ్‌సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా