
టిటిడి ఉద్యోగి బాలాజీఫై దురుసుగా ప్రవర్తించిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ ఉద్యోగులు గురువారం నిరసన తెలిపారు. పరిపాలనా భవనం ఎదుట టిటిడి ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామికి సేవ చేసేందుకు టిటిడి బోర్డులోకి వచ్చిన వ్యక్తులు టిటిడి ఉద్యోగులపై పెత్తనం చేయాలనుకోవడం సరైనది కాదని స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్ మహాద్వారం ముందు విచక్షణ కోల్పోయి, ఆగ్రహంతో ఊగిపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకున్న నిమిషాల వ్యవధిలోనే ప్రశాంతతను కోల్పోయి వ్యవహరించడం విడ్డూరంగా ఉందని పేర్కొంటూ ఇలాంటివారు బోర్డులో ఉంటే శ్రీవారికి ఎలా సేవ చేయగలరని ప్రశ్నించారు.
ఇటీవల బోర్డు సభ్యుల తీరు ఆక్షేపణీయంగా ఉందని, దీన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు రాజకీయాలను అంటకట్టడం బాధాకరమని తెలిపారు. ఇక్కడ ఉద్యోగులు వ్యక్తిత్వం లేనివాళ్లు కాదని, రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉద్యోగులకు లేదని తెలిపారు. జరిగిన తప్పులు సరిదిద్ది శిక్షించాల్సిన వారు, దీనిపై స్పందించకుండా నిమ్మకు నీలెత్తినట్లు వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
నరేష్ కుమార్ వెంటనే ఉద్యోగికి క్షమాపణ చెప్పాలని, బోర్డు మెంబర్ పదవి నుంచి అతనిని తొలగించాలని డిమాండ్ చేశారు. టిటిడి ఉద్యోగులు ప్రధాన ద్వారం వద్ద భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి, ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. బోర్డు చైౖర్మన్ తరఫున సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, టిటిడి ఇఒ కార్యనిర్వహణాధికారి తరఫున అడిషనల్ ఇఒ వెంకయ్య చౌదరి, ఉద్యోగుల జెఎసి నాయకులతో సుమారు గంట పైగా చర్చలు జరిపారు.
ఘటనపై విచారణ జరుపుతామని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, అంతవరకు సమన్వయం పాటించాలని కోరారు. కనీసం క్షమాపణ కూడా చెప్పకపోవడాన్ని ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. వెంటనే చర్యలు చేపట్టాలని, లేకపోతే నిరసన కొనసాగిస్తామని ఉద్యోగులు తేల్చి చెప్పారు. సమన్వయం పాటించాలని అడిషనల్ ఇఒ కోరడంతో ఉద్యోగులు రెండు రోజులు సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. రెండ్రోజుల పాటు మౌన ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు.
More Stories
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు