ఆప్ మాజీ మంత్రి ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి

ఆప్ మాజీ మంత్రి ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ (60)కు మరిన్ని న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. మనీలాండరింగ్ కేసులో ఆయనపై విచారణ జరిపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారంనాడు అనుమతించారు. సత్యేంద్ర జైన్ ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 14న రాష్ట్రపతిని కోరింది.

సత్యేంద్ర జైన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు తగినన్ని ఆధారాలను ఎన్‌‍ఫోర్సెంట్ డైరక్టరేట్ సేకరించినట్టు ఎంహెచ్ఏ తెలిపింది. దీంతో ఆయనపై లీగల్ చర్యలు తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని తాము కోరామని పేర్కొంది. రాష్ట్రపతి ఆమోదించడంతో భారతీయ నాగరిక్ సురక్షా సమితి (బీఎన్ఎస్ఎస్) 2023లోని సెక్షన్ 2018 కింద కేసు విచారణ జరుగుతుందని తెలిపింది.

మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ 2022 మే 30న అరెస్టయ్యారు. 2015-2016లో షెల్ కంపెనీల ద్వారా రూ.16.39 కోట్ల మేరకు లాండరింగ్‌కు పాల్పడ్డారు. అరెస్టు అనంతరం తీహార్‌ జైలుకు ఆయనను తరలించారు. విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యం, జైలులో సుదీర్ఘకాలం ఉండటంతో ఆయనకు 2023 అక్టోబర్ 18న ఢిల్లీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. 

కాగా, తాజాగా సత్యేంద్రజైన్‌ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కోర్టులో విచారణ మొదలవుతుంది. కోర్టులో దోషిగా తేలితే లీగల్‌పరంగా చిక్కులు తప్పవు. ఆయన రాజకీయ కెరీర్‌పై కూడా ఆ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి.