
ఆంధ్ర ప్రదేశ్ లో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామని, ముఖ్యంగా వైదిక, ఆగమ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోమవారం సాయంత్రం తిరుపతి ఆశా కన్వెన్షన్‌లో అంతర్జాతీయ ఆలయాల సదస్సు-ప్రదర్శన (ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో-ఐటీసీఎక్స్-2025) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మూడు రోజులు జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ కూడా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖ ద్వారా తన సందేశాన్ని అందించగా, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
దేవాలయాల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, ఇటీవలే దేవదాయ శాఖ చట్టాన్ని సవరించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్చకుల పారితోషికాలు పెంచామని గుర్తు చేశారు. హిందూయిజం, జైనిజం, సిక్కిజం, బుద్ధిజం ఈ నాలుగు భారతదేశంలోనే పుట్టాయని, సనాతన ధర్మ పరిరక్షణలో వీటి పాత్ర కూడా కీలకమని తెలిపారు.
ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, ఆదాయ వనరులు కూడా అని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రూ. 6 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఆలయాల ద్వారా వస్తోందని ఆయన గుర్తు చేశారు. భక్తులు ఇచ్చే కానుకలు వారు దేనినైతే ఉద్దేశించి ఇస్తారో దానికే ఖర్చు చేయాలని, దీంతో పాటుగా ధార్మిక కార్యక్రమాలకు విని యోగం చేయాల్సి ఉందని చెప్పారు.
భారతదేశంలో కుటుం వ్యవస్థ బలంగా ఉందంటే, సనాతన సాంప్రదాయాలను, సంస్కతి పద్ధతులను దఢంగా నమ్మి పాటించడమే కారణమని ముఖ్యమంత్రి చెప్పారు. తిరుపతని జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెబుతూ ‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవేంకటేశ్వరుడి ఆలయం నిర్మించాలనేది నా ఆకాంక్ష. అలాగే హిందువులున్న ప్రతి దేశంలోనూ శ్రీవారి ఆలయం ఉండాలని ఆశిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు
‘గత ఏడెనిమిది నెలల్లో ఆలయాల అభివృద్ధికి రూ.138 కోట్లు ఖర్చు చేశాం. వేద విద్య అభ్యసించిన వారికి ఆలయాల్లో పని దొరికేదాకా నెలవారీ భృతి ఇస్తున్నాం. ప్రతి ఆలయ ట్రస్టు బోర్డులో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేలా చట్టం తెచ్చాం. అన్ని గుళ్లలో ఐవీఆర్‌ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరిస్తున్నాం. క్యూఆర్ కోడ్‌తో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. ఏఐ, సీసీ కెమెరాలు, డ్రోన్ పెట్రోలింగ్ వంటివి చేస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు.
ఐటీసీఎక్స్-2025 ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన ఆలయాల ట్రస్టులను ఏకం చేస్తోందని, ఆలయాల ఉత్తమ నిర్వహణ, భద్రత, పారదర్శక ఆర్థిక వ్యవస్థల కోసం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆలయాల యాజమాన్యాలను ఒకే వేదికపైకి తెచ్చి ఆలయాల అభివృద్ధితో పాటు భక్తుల సంక్షేమానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు.
‘వారాణసీలో తొలి సదస్సు నిర్వహించిన ఐటీసీఎక్స్ రెండో సదస్సును సరైన సమయంలో తిరుపతిలో నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1,500కు పైగా ఆలయాల కమిటీలు కలుస్తుండడం గొప్ప విషయం. వర్చువల్‌గా కూడా ఎంతోమంది ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రత్యక్షంగా 111 మంది వక్తలు పాల్గొని ఆలయాల నిర్వహణపై దిశానిర్దేశం చేస్తుండడం ప్రశంసనీయం. 15 వర్క్‌షాపులతో పాటు 60కి పైగా వివిధ స్టాల్స్ ఏర్పాటు ఆలయాల సక్రమ నిర్వహణకు ఉపకరిస్తాయి’ అని చెప్పారు.
సమావేశంలో ఆధ్యాత్మికవేత్త ఆచార్యగోవింద్ దేవ్ గురూజీ, ఆర్ఎస్ఎస్ సహా సర్ కార్యవహ్ ముకుంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, మహారాష్ట్ర మంత్రులు ఆశిష్ షెలార్, మేఘన బోరిద్కర్, గోవా మంత్రి విశ్వజిత్ రాణే, ఎంపీ ప్రవీణ్ దార్కేర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అంత్యోదయ ప్రతిష్టాన్ చైర్‌పర్సన్ నీతాలాడ్ పాల్గొన్నారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత