ముగింపు దశకు ఉక్రెయిన్‌తో యుద్ధం!

ముగింపు దశకు ఉక్రెయిన్‌తో యుద్ధం!
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతూ.. వేలాది మంది ప్రాణాలను తీసుకున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ముఖ్యంగా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. మాస్కోలో జరిగిన రష్యా ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్ చేసిన ఈ వాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. 
 
సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం చివరి దశకు చేరుకుందని చెప్పడంతో ఇంకొన్ని రోజుల్లోనే ఈ యుద్ధం పూర్తిగా ముగిసిపోతుదని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  2022 ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న ఈ ఘర్షణపై పుతిన్ సానుకూల సంకేతాలు  ఇచ్చారు. యుద్ధ విరమణకు సంబంధించిన సంప్రదింపుల కోసం రష్యా సిద్ధంగా ఉందనే విషయాన్ని ఆయన మాటలు స్పష్టం చేశాయి. 
 
అయితే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ఎలాంటి కాలపరిమితిని గానీ, నిర్దిష్ట ప్రణాళికను గానీ ఆయన వెల్లడించలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీపై స్పందిస్తూ శాశ్వత శాంతి ఒప్పందం కుదిరిన తర్వాతే నేరుగా సమావేశం అవుతానని పుతిన్ స్పష్టం చేశారు.  ఈ పరిణామాలకు ఒక రోజు ముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో తన అభ్యర్థన మేరకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించారు. 
 
ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పిన మరునాడే పుతిన్ కూడా యుద్ధం ముగుస్తోందని అనడం, త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందన్న ఆశలను పెంచుతోంది.   యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడిలో ఒకటిగా, ఇరు దేశాలు చెరో 1,000 మంది ఖైదీలను మార్చుకోవడానికి కూడా అంగీకరించాయి.
 
సాధారణంగా రష్యా విక్టరీ డే అంటే రెడ్ స్క్వేర్‌పై భారీ ట్యాంకులు, ఆయుధ ప్రదర్శనలతో హోరెత్తుతుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఉక్రెయిన్ నుంచి ముప్పు ఉండవచ్చనే భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు.  ఆయుధాలను నేరుగా ప్రదర్శించకుండా డిజిటల్ స్క్రీన్లపై క్షిపణులు, డ్రోన్లను చూపించారు. ఈ పరేడ్‌లో రష్యా సైనికులతో పాటు ఉత్తర కొరియా బలగాలు కూడా పాల్గొనడం విశేషం.  తన ప్రసంగంలో, పుతిన్ రష్యా సైనికులను ప్రశంసించారు. 
రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న దురాక్రమణ చర్యలకు నాటో దేశాలు మద్దతు ఇస్తున్నాయని మరోసారి ఆరోపించారు.  కుర్స్క్ ప్రాంతంలో రష్యా దళాలతో కలిసి పోరాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా సైనికులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారని తెలుస్తున్నది. యూరోపియన్ నాయకులతో చర్చలను పునఃప్రారంభించడానికి రష్యా సుముఖంగా ఉండవచ్చని కూడా పుతిన్ సూచించారు.
ఏ యూరోపియన్ నాయకుడితో చర్చలు జరపడానికి ఇష్టపడతారని అడిగినప్పుడు, మాస్కోతో దీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగిస్తున్న మాజీ జర్మన్ ఛాన్సలర్ గెర్హార్డ్ ష్రోడర్ పేరును పుతిన్ ప్రస్తావించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత రక్తపాతం సృష్టించింది రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే. అయితే ఈ పోరుకు స్వస్తి పలికితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, శాంతికి పెద్ద ఊరటనిస్తుంది. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ దౌత్యపరమైన చర్చలు ఏ మేరకు సఫలం అవుతాయో వేచి చూడాలి.