గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి

గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి

ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న ఓ రకమైన నరాల వ్యాధి జీబీఎస్‌ (గులియన్‌ బారీ సిండ్రోమ్)తో ఏపీలో మొదటిసారిగా గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళా ఆదివారం సాయంత్రం మృతి చెందారు.  కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ తీవ్రజ్వరం, కాళ్లు చచ్చు పడిపోవడంతో తొలుత గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 
 
ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిజిహెచ్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. గత 13 రోజులుగా ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించింది. కమలమ్మ మృతిని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధ్రువీకరించారు.
 
మరోవైపు జీజీహెచ్లో ఈ నెల 11న ఒక్కరోజే ఏడు కేసులు వచ్చాయి. ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు. ప్రస్తుతం ఏపీలోని వేర్వేరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు.

ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సినదేనని వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఒకరకంగా పక్షవాతం లాంటిదే అని చెబుతున్నారు. చాలావరకు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారికే మొదలవుతుందని భావిస్తున్నారు. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయని పేర్కొంటున్నారు. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం కాకముందే నయం చేయవచ్చని వివరిస్తున్నారు. 

 
ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుందని తెలియజేస్తున్నారు. పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నారులకు, శిశువులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని మొదటగా మహారాష్ట్రలో నిర్ధారించారు. లక్ష మందిలో ఒకరికి అరుదుగా కనిపించే వ్యాధి. ఈ కేసులు ఏపీలో ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 
 
ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ప్రమాదం సంభవిస్తుంది. ఇతర ఇన్‌ఫెక్షన్లు వచ్చినా, కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి.