2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
* సుంకాలపై అమెరికా- భారత్ మధ్య కొనసాగుతున్న విబేధాలు
 
2030 నాటికి ఇరు దేశాల మధ్య 500 బిలియన్‌ డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా ‘మిషన్‌ 500’ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ‘యూఎస్-ఇండియా 123 పౌర అణు ఒప్పందం’ అమలుకు కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలూ వెల్లడించారు. 
 
అమెరికా, ఇండియాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారానికి సంబంధించి 2025 మార్గదర్శిగా నిలవబోతోందని.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి భారతీయ వ్యోమగామిని పంపడానికి నాసా-ఇస్రో కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇరు దేశాలూ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
 
పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల బృందాలు త్వరలోనే అంగీకారానికి వస్తాయని ప్రధాని మోదీ చెప్పారు.  ఇంధన భద్రత కోసం చమురు, గ్యాస్‌ వాణిజ్యంపై దృష్టి సారిస్తామని, ఇంధన మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు అణు ఇంధనాన్ని కూడా పెంచుతాయని పేర్కొన్నారు. చిన్న మాడ్యులర్‌ రియాక్టర్లపై సహకారాన్ని పెంచుకునే విషయంపై కూడా ట్రంప్‌తో చర్చించానని తెలిపారు. 
 
కాగా అణు సహకారంపై ట్రంప్‌ కూడా మాట్లాడుతూ దీనివల్ల లక్షలాది మంది భారతీయులకు సురక్షి తమైన, స్వచ్ఛమైన విద్యుత్‌ అందుబాటు ధరలో లభిస్తుందని చెప్పారు. చమురు, గ్యాస్‌ అమ్మకాలతో వాణిజ్య లోటును సులభంగా పూడ్చుకోగలమని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై తాను, మోదీ ఓ ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. 
 
భారత్‌కు చమురు, గ్యాస్‌ సరఫరా చేసే ప్రపంచ దేశాల జాబితాలో అమెరికాది ప్రథమ స్థానం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారత్‌తో అమెరికా వాణిజ్య లోటు సుమారు 100 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత నాలుగు సంవత్సరాల కాలంలో చోటుచేసుకున్న అసమానతలపై చర్చించి పరిష్కారాన్ని సాధించాలని నేను, మోదీ అంగీకారానికి వచ్చాం. వీటిపై ఇప్పటికే చర్చించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు’ అని ట్రంప్‌ వివరించారు.

అయితే ‘భారతీయ మార్కెట్లలో ప్రవేశించడానికి అసమంజసంగా ఉన్న అధిక సుంకాలు మాకు ప్రధాన సమస్యగా ఉన్నాయి. నిజానికి ఇది పెద్ద సమస్య’ అని ట్రంప్‌ విలేకరుల ప్రశ్నలకు బదులుగా స్పష్టం చేశారు. సుంకాల విషయంలో రెండు దేశాల మధ్య స్పష్టత రాకపోవడం గమనార్హం.

 ‘అనేక వస్తువులపై భారత్‌ 30, 40, 60….70 శాతం సుంకం కూడా విధిస్తోందని నేను చెప్పాల్సి ఉంది. కొన్నింటి విషయంలో సుంకాలు అంతకంటే ఎక్కువగా కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత్‌కు వెళుతున్న అమెరికా కార్లపై 70 శాతం సుంకం విధిస్తున్నారు. దీంతో వాటిని అక్కడ విక్రయించడం అసంభవం అవుతోందని ట్రంప్ తెలిపారు. 

‘‘అది ఇండియా కానివ్వండి, మరే దేశమైనా కానివ్వండి.. మా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తే మేమూ అలాగే విధిస్తాం. భారత్‌ ఎలా వసూలు చేస్తే.. మేమూ అలాగే వసూలు చేస్తాం’’ అని తేల్చి చెప్పారు.

కాకపోతే.. భారతదేశంతో పోలిస్తే చైనా, యూరోపియన్‌ యూనియన్‌తో వాణిజ్యసంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో తన తొలి హయాంలో జరిపిన చర్చల వల్ల సుంకాలు తగ్గలేదని.. అందుకే ఈసారి పరస్పర సుంకాల విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మోదీతో భేటీ కావడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ పరస్పర సుంకాలకు సంబంధించిన ఉత్తర్వుపై సంతకం చేశారు.

కాగా, మునుపెన్నడూ లేని విధంగా.. ప్రపంచవ్యాప్తంగా రాడికల్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌, అమెరికా కలిసి పనిచేస్తాయని ట్రంప్‌ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్‌, అమెరికా దేశాలు కలిసికట్టుగా వ్యవహరిస్తాయని మోడీ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే పటిష్ట చర్యలు అవసరమని తాము అభిప్రాయపడ్డామని అన్నారు. 

భారత్‌-చైనా సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని, అవి ఆగిపోవాల్సిన అవసరం ఉన్నదని మోదీ స్పష్టం చేశారు. ‘మాకు చైనాతో మంచి సంబంధాలు ఉంటాయని అనుకుంటున్నాను. కోవిడ్‌ వచ్చే వరకూ దేశాధ్యక్షుడు క్సితో బాగానే సంబంధాలు నెరిపాను. అప్పటి వరకూ మేము బాగా సన్నిహితంగా గడిపాం. ప్రపంచంలో చైనా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందని నేను విశ్వసిస్తున్నాను. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధ నివారణకు వారు కృషి చేసి ఉండవచ్చు’ అని తెలిపారు. 

“భారత్‌-చైనా సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అవి కొనసాగుతూనే ఉన్నాయని అనుకుంటున్నా. ఈ విషయంలో నేనేమైనా చేయగలిగేది ఉంటే చేస్తా. ఎందుకంటే ఘర్షణలు ఆగిపోవాలి. అవి చాలా కాలం నుండి కొనసాగుతున్నాయి. హింస జరుగుతోంది. చైనా, రష్యా, భారత్‌…మేమందరం కలిసి ముందుకు సాగగలం. అది చాలా ముఖ్యం’ అని మోదీ వివరించారు.