టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గతంలో మాధవిలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  గత ఏడాది డిసెంబర్ 31 గర్ల్స్ ఈవెంట్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవిలత మధ్య వివాదం రాజుకుంది. తనకు బెదిరింపు కాల్స్‌తో పాటు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని మాధవిలత సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో తెలిపారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాధవీలత కోరారు.

కాగా, గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలో ఘనంగా నూతన సంవత్సర  వేడుకలు జరిగాయి. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం ఈ స్పెషల్ ఈవెంట్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. ఈ ఈవెంట్‌ను మాధవిలత తప్పుపట్టారు. దీంతో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఇదే సమయంలో జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

దీంతో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ పరిణామాల నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఆవేశంలో అలా మాట్లాడానని, తాను చేసింది తప్పేనని జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరారు. అయితే కొన్ని రోజుల క్రితం మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.