2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి

2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2030 నాటికి భారతదేశం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఇండియా ఎనర్జీ వీక్ 2025 కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన క్రమంలో దేశం కొత్త ఇంధన భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించారు. 
 
ఈ క్రమంలో 2030 నాటికి 500 జిడబ్ల్యు పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశం వృద్ధికి చాలా కీలకమని,ఈ దశాబ్దాలలో ఎంతో ప్రగతిని సాధిస్తామని మోదీ తెలిపారు.  ఇదే సమయంలో భారత రైల్వేలు 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు. 
 
అదనంగా ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి దేశంగా ఉంది. ఈ క్రమంలో శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచినట్లు ప్రధాని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇథనాల్ మిశ్రమ వినియోగం 19 శాతం పెరిగిందని, 2025 నాటికి 20 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ చెప్పారు.ఈ క్రమంలో ఇండియా బయోఫ్యూయల్ విభాగంలో 500 మిలియన్ మెట్రిక్ టన్నుల ఫీడ్‌స్టాక్ మద్దతుతో వేగవంతమైన వృద్ధిని సాధించగలదని మోదీ ధీమా వ్యక్తం చేశారు. జి20 అధ్యక్షత వహించిన సమయంలో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ స్థాపించారు. ఇప్పటివరకు 28 దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థలు దీనిలో చేరాయి.

పారిస్ జి20 ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న తొలి దేశం భారతేనని, రానున్న రెండు దశాబ్దాలు భారత దేశానికి అత్యంత కీలకమని ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో భారతదేశం తన హైడ్రోకార్బన్ వనరులను మరింత సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మోదీ. భారతదేశం గ్యాస్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తూ, సహజ వాయువు రంగంలో అధిక శాతం వాటా పొందేందుకు ప్రయత్నాలు చేస్తోందని మోదీ పేర్కొన్నారు.

సౌర ఉత్పత్తిని సామర్థ్యాన్ని డబుల్ చేసి మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా భారత్ నిలిచిందని మెచ్చుకున్నారు. ఇండియా తన వృద్ధిని సాధించడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తోందని ప్రశంసించారు. ఇంధన రంగంలో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. 

21వ శతాబ్దం భారత్‌దేనని ప్రపంచంలోని నిపుణులు చెబుతున్నారని, వనరులు, మేధో సంపత్తి, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రపంచ సుస్థిరతపై భారత్‌కు నిబద్ధత ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద శుద్ధి కేంద్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి 21వ శతాబ్దం భారతదేశం శతాబ్దంగా మారుతుందన్న వాదనను పునరుద్ధరించారు ప్రధాని.

శక్తి రంగంలో తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు, పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి రంగాలలో పునర్నిర్మాణం ద్వారా ప్రపంచ ఇంధన వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషించడానికి అవకాశం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ క్రమంలో భారత్ ఇంధన పరివర్తన ప్రపంచ స్థాయిలో కొత్త మార్గాలను నిర్మిస్తుందని చెప్పారు.