కుంభమేళాకు వెళ్లి వస్తుండగా 8 మంది తెలంగాణ వాసుల మృతి

కుంభమేళాకు వెళ్లి వస్తుండగా 8 మంది తెలంగాణ వాసుల మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో బస్సులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. బాధితులను సిహోరాలోని ఆసుపత్రికి తరలించారు. 

మృతులు హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు హైవే పైకి రాంగ్‌ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు ప్రమాదానికి గురైన వాహనం నంబరు ఏపీ 29 డబ్ల్యు 1525గా పోలీసులు గుర్తించారు. అయితే మినీ బస్సు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఆంధ్రప్రదేశ్​ వాసులు అయి ఉంటారని తొలుత వారు భావించారు.  తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా నిర్ధారించారు. మృతులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శశికాంత్‌ కుటుంబసభ్యులుగా గుర్తించారు. ఘోర ప్రమాదంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా, జబల్‌పూర్ సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో  తెలంగాణకు చెందిన వ్యక్తులు మృతి చెందిన ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. 

మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని  సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్ల తోనూ మాట్లాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులనూ ఫోన్‌లో కేంద్రమంత్రి పరామర్శించారు.