
భారత తీరరక్షక దళం (కోస్ట్‌గార్డ్) మాజీ డైరెక్టర్ జనరల్ కె.నటరాజన్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. సీనియర్ అధికారుల వార్షిక రహస్య నివేదిక (ఎసిఆర్), డాసియర్‌లను తారుమారు /మార్పు చేయడం ఆరోపణలపై కె. నటరాజన్ సహా పలువురిపై కేసు నమోదైనట్లు సిబిఐ అధికారులు మంగళవారం తెలిపారు. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ కేసుల్లో నటరాజన్‌ను నిందితుడిగా పేర్కొన్నారు.
నటరాజన్ 2019 జులై 1న కోస్ట్‌గార్డ్ 23వ డైరెక్టర్ జనరల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2021 డిసెంబర్‌లో పదవీవిరమణ పొందారు. తనఎసిఆర్‌లు/డాసియర్‌ల సంఖ్యాపరమైన అంచనాను ఉద్దేశపూర్వకంగా తగ్గించడంతో 2019లో తాను అదనపు డైరెక్టర్ జనరల్‌గా (ఎడిజి)గా ప్రమోషన్ పొందలేకపోయానని ఐజి రాకేష్ పాల్ 2021 జులై 7న రక్షణ శాఖ కార్యదర్శి కార్యాలయానికి తెలిపారు.
పాల్ 2022 ఫిబ్రవరిలో ఎడిజిగా ప్రమోషన్ పొందడంతో పాటు 2023 ఫిబ్రవరిలో డిజిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2023 జులైలో 25వ కోస్ట్‌గార్డ్ డిజిగా నియమితులయ్యారు. అయితే పాల్ 59 ఏళ్ల వయస్సులో 2024 ఆగస్ట్ 18న చెన్నైలో మరణించారు. రాకేష్ పాల్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, గత ఏడుసంత్సరాల ఎసిఆర్‌లను పరిశీలించాలని జాయింట్ సెక్రటరీ (సాయుధ దళాలు), జాయింట్ సెక్రటరీ (బిఆర్‌ఒ అండ్ సెర్)తో కూడిన నిజనిర్ధారణ కమిటీని రక్షణమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2019 సెప్టెంబర్ నుండి ఎడిజి ర్యాంక్‌కు పదోన్నతి కోసం పరిశీలనలో ఉన్న ఐజిలు/ఎడిజిలకు సంబంధించి గత ఏడేళ్ల ఎసిఆర్‌లను పరిశీలించాలని కమిటీని కోరింది. 2019, 2021లలో జరిగిన డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డిపిసి) సమావేశాల్లో ఎడిజి ర్యాంక్ పదోన్నతి కోసం పరిశీలనలో ఉన్న కొన్ని అధికారుల ఎసిఆర్‌లలో అక్రమాలు జరిగాయని కమిటీ నివేదించినట్లు ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.
పలువురు అధికారుల ఎసిఆర్‌లు/ డాసియర్‌లలో మార్పులు జరిగాయని, కొంతమంది ఎసిఆర్‌లు కూడా గల్లంతైనట్లు గుర్తించింది. ఐజి రాకేష్ పాల్‌ను మరో ఇద్దరు అధికారల కంటే తక్కువగా 3వ స్థానంలో ఉంచడంతో 2019లో జరిగిన డిపిసిలో ఆయన పదోన్నతి పొందలేకపోయారని కమిటీ తేల్చింది. ఐజి రాకేష్ పాల్ ఎసిఆర్‌లో మార్పులు 2019వ సంవత్సరంలో కోస్ట్‌గార్డ్ డిజి కె.నటరాజన్ హయాంలో జరిగినట్లు ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.
More Stories
ఎల్ఐసీలో 1 శాతం వాటా విక్రయం
ఆగస్టు నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు