
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం రూ.16,891 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.9,164 కోట్ల లాభం తో పోలిస్తే 84 శాతం వృద్ధి కనబరిచింది. 2024-25లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో నమోదైన రూ.18,331 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గింది. మరిన్ని ముఖ్యాంశాలు:
* ఈ క్యూ3లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరిగి రూ.41,446 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి బ్యాంక్ రుణాలు దాదాపు 14 శాతం వృద్ధి చెంది రూ.40.68 లక్షల కోట్లకు చేరినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) మాత్రం 0.19 శాతం తగ్గుదలతో 3.15 శాతానికి పరిమితమైంది.* డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ డిపాజిట్లు 9.81 శాతం వృద్ధితో రూ.52.3 లక్షల కోట్లకు పెరిగాయి. అందులో దేశీయ బ్రాంచీల్లోని కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ల (కాసా) డిపాజిట్లు 4.46 శాతం పెరిగి రూ.19.65 లక్షల కోట్లకు చేరాయి.
*‘‘కస్టమర్ల ప్రాధాన్యాలు మారడంతో సమీక్ష కాలానికి బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 3.15 శాతానికి తగ్గింది. కస్టమర్లు పొదుపు ఖాతాల కంటే అధిక వడ్డీ ఆదాయం అందించే ఎఫ్‌డీల్లో సొమ్ము జమ చేస్తున్నారు. అయితే, మార్జిన్ 3 శాతం కంటే తగ్గదు. గత త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లలో 39.2 శాతానికి తగ్గిన కాసా అకౌంట్ల వాటా మళ్లీ పెంచడం కష్టమే’’నని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు.
* ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, డిసెంబరు చివరి నాటికి బ్యాంక్ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్ ఎన్‌పీఏ) 2.07 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 0.53 శాతానికి జారుకున్నాయి. ఈ క్యూ3లో కొత్త రూ.3,823 కోట్ల రుణాలు మొండి పద్దులుగా మారాయని బ్యాంక్ తెలిపింది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి
ప్రపంచ వృద్ధిని దెబ్బ తీస్తున్న ట్రంప్ విధానాలు