కాంగ్రెస్ మరోసారి బిసిలను మోసం చేసింది

కాంగ్రెస్ మరోసారి బిసిలను మోసం చేసింది

కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని, తెలంగాణ శాసనసభను వేదికగా చేసుకుని బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు కొనసాగిస్తోందని బిజెపి శాసనసభ ఉప నాయకుడు పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ  బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆయన దాటవేసే ధోరణి అవలంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  “మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నాం… కానీ, సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఇవ్వలేకపోతున్నా”మంటూ ప్రభుత్వం అంటోందని పేర్కొంటూ ఒక తీర్మానం చేయడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టాల్సిన అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.ఇచ్చిన మాట నిలబెట్టులేక, బీసీలను మభ్యపెట్టే విధంగా శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారించిందని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదని పాయల్ శంకర్ తెలిపారు.  2024లో బీసీల జనాభా ఎలా తగ్గిపోయింది? అని అడిగితే స్పష్టమైన సమాధానం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత? ఏ జిల్లాలో ఎంతమంది తగ్గారు? అని ప్రశ్నిస్తే డేటా బహిర్గతం చేయలేమంటున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

కుల గణన సర్వే ప్రకారం ఆయా సామాజిక వర్గాల వారి సంఖ్య చెప్పమంటే, దాటవేయాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. . 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంసిఆర్ వెబ్‌సైట్‌లో అధికారికంగా కులగణన డేటాను నాటి ప్రభుత్వం అందుబాటులో ఉంచగా, ఇప్పుడు ముఖ్యమంత్రి “ఆ డేటా ప్రామాణికం కాదు” అని అంటున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

ఎస్సీల సంఖ్యను తక్కువగా చూపడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? కులగణన సర్వే రిపోర్టులో బీసీలు, ఎస్సీల సంఖ్యను ఎందుకు తగ్గించి చూపించారు? మిగతా సామాజిక వర్గాల సంఖ్య ఎలా పెరిగింది? అని పాయల్  శంకర్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను అణగదొక్కాలని కుట్ర పన్నుతోందని పేర్కొంటూ బీసీలను మోసం చేయడమే వారి ఉద్దేశం అని అయన స్పష్టం చేశారు.

ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి, కేవలం 1% మాత్రమే ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని చెబుతూ అందుకోసం శాసనసభ సమావేశం కావాలా? అని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ పరంగా ఎంత శాతం రిజర్వేషన్లు ఇస్తారోననేది వారి పార్టీ ఆఫీసులో నిర్ణయించుకోవచ్చని చెబుతూ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం ఆర్థికంగా, సామాజిక పరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బిజెపి ఎమ్యెల్యే డిమాండ్ చేశారు.  శాసనసభలో బీసీల హక్కుల గురించి, వారి ఆదుకునేలా గొప్ప ప్రకటన వస్తుందని ఆశించామని, కానీ, ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు.

గతంలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయగా, ఇప్పుడు అదే విధంగా కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో వ్యవహరిస్తోందని ఆయన విమరసంచారు. 119 మంది శాసనసభ్యులు ఉన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక్క బీసీ ఎమ్మెల్యే మాట్లాడితే నలుగురు మంత్రులు అడ్డుపడే ప్రయత్నం చేశారని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసి, ఎలా ఆదుకుంటుందో చెప్పలేక దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు.

అనేక రకాల హామీలిచ్చి, ఆఖరుకు మోసం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేయడం అన్యాయం అని చెప్పారు.  బీసీల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీ సమాజం జాగృతం కావాలని చెబుతూ లేకుంటే బీసీలకు సరైన భవిష్యత్తు లేదని ఆయన హెచ్చరించారు. బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీసీలందరినీ ఆయన పిలుపిచ్చారు. .

*