గాజా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటన

గాజా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. అక్రమ వసలదారులపై ఒకవైపు ఉక్కుపాదం మోపుతూనే అంతర్జాతీయ వివాదాలపై దృష్టి సారించారు. ఘర్షణలు, ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం, దాడులు- ప్రతిదాడులను నివారించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా అంశాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.

ఇజ్రాయెల్ దాడులతో అట్టుడికిపోతున్న గాజాపై తాజాగా సంచలన ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. గాజాను తాము స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. తమ సొంత ప్రాంతంగా భావిస్తామని తెలిపారు. పాలస్తీనియన్లకు పునరావాసాన్ని కల్పించిన తర్వాత గాజా తమ ఆధీనంలోకి వస్తుందని వెల్లడించారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఆయన సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ ముఖాముఖి భేటీ కొనసాగింది. పలు అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి మధ్య- తూర్పు, మధ్య ఆసియా రీజియన్‌లో నెలకొన్న ఉద్రిక్తత అంశం ప్రస్తావనకు వచ్చింది..

గాజా, లెబనాన్‌ను కేంద్రంగా చేసుకుని దాడులు, అశాంతియుత వాతావరణానికి కేంద్ర బిందువు అవుతున్నట్లుగా భావిస్తోన్న హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపుల దూకుడును అరికట్టడం, దానికోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ట్రంప్- నెతన్యాహు చర్చించారు. గత ఏడాది ఈ రెండు గ్రూపులపై సాగించిన దాడుల గురించి నెతన్యాహు ఆయనకు వివరించారు.

అనంతరం ట్రంప్, నెతన్యాహు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మధ్య- తూర్పు ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని నిర్మూలించడానికి తక్షణ చర్యలను తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ రీజియన్‌ను ది రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్గా పునర్నిస్తానని చెప్పారు. ఈ క్రమంలో గాజాను తాము సొంతం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.

‘పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత అమెరికా గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటుంది. యుద్ధంలో భాగంగా అక్కడ ఇజ్రాయెల్‌ అమర్చిన అత్యంత ప్రమాదకరమైన బాంబులను, ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను అమెరికా తీసుకుంటుంది. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

దీనికంటే ముందు పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారికి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నివాస వసతిని కల్పిస్తానని చెప్పారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌తో కలిసి పని చేస్తామని, ఇరాన్‌పై ఒత్తిడిని తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య వివాదానికి చెల్లుచీటి పలకాల్సిన బాధ్యతను తాను తీసుకుంటానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో గాజాకు అమెరికా సాయుధ బలగాలను పంపించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అక్కడి ప్రజలకు భద్రత కల్పించడానికి తమ దేశ సైన్యాన్ని వినియోగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. గాజాకు ఏది అవసరమో అవన్నీ సమకూరుస్తానని చెప్పారు.

కాగా, గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్‌ ప్రకటించడాన్ని హమాస్‌ తీవ్రంగా ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మిలిటెంట్ సంస్థకు చెందిన సీనియర్‌ అధికారి సమీఅబు జుహ్రీ మండిపడ్డారు. మా ప్రజలు దీనిని ఆమోదించరాని, వారి భూమి నుంచి వారినే తరలించడమే కాకుండా, ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉంది అని ఓ ప్రకటనలో తెలిపారు.

మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఏజెన్సీ నుంచి అమెరికా వైదొలుగుతుందని ట్రంప్‌ ప్రకటించారు. ఇక నుంచి పాలస్తీనా శరణార్థులకు అమెరికా మానవతాసాయాన్ని అందించబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే యునెస్కో నుంచి వైదొలగాలని, అలాగే ఐరాసకు నిధులు ఆపేయాలన్న ప్రతిపాదనను సమీక్షించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు.

ఇక తనను చంపాలని చూస్తే మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే అవుతుందని ఇరాన్​కు ట్రంప్ హెచ్చరించారు. ‘నన్ను హత్య చేస్తే ఇరాన్‌ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికే నా సలహాదారులకు ఆదేశాలిచ్చా. ఆ దేశంపై గరిష్ఠ ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కఠిన విధానాల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చా. టెహ్రాన్‌ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చాం’ అని ట్రంప్ ప్రకటించారు.