లిబియా నిర్బంధం నుండి 16 మంది కార్మికులకు విముక్తి

లిబియా నిర్బంధం నుండి 16 మంది కార్మికులకు విముక్తి

లిబియా సిమెంట్‌ ఫ్యాక్టరీలో నిర్బంధానికి గురైన  16 మంది కార్మికులు మంగళవారం భారతదేశానికి బయలుదేరారు. పది నెలలుగా లిబియాలో చిక్కుకుపోయిన కార్మికులు భారత్‌ వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. లిబియా సిమెంట్‌ కంపెనీకి చెందిన బెంఘాజీ ప్లాంట్‌లో జైలులాంటి పరిస్థితుల్లో 16మంది భారతీయ కార్మికులు నిర్బంధించచారు. 

అధిక పనిగంటలు, అస్థిరమైన వేతనాలతో తమ యజమాని కాంట్రాక్ట్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ నిరసన వ్యక్తం చేశారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. భారత్‌ నుండి దుబాయ్ మీదుగా లిబియా వెళ్లేందుకు  కాంట్రాక్టర్‌ అబూబక్కర్‌ (లిబియా దేశస్తుడు) సాయం చేశారని కార్మికులు మీడియాకు తెలిపారు. 

గత ఏడాది సెప్టెంబర్‌లో వేతనాల్లో కోతను గమనించామని, అప్పటి నుండి ఇబ్బందులు ప్రారంభమయ్యాయని తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన మిథిలేష్‌ విశ్వకర్మ చెప్పారు. ఎనిమిదిన్నర పనిగంటలను పెంచారని, దీంతో  నాలుగు నెలల క్రితం కంటే రెట్టింపు పనిగంటలయ్యాయని అన్నారు. షిప్టులతో ఒక్కోసారి అర్థరాత్రి దాటిపోయేదని పేర్కొన్నారు.

పనిగంటలను తగ్గించాలని, వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సెప్టెంబర్‌లో తాము నిరసన చేపట్టామని, అదే సమయంలో కాంట్రాక్టర్‌ దుబాయ్ నుండి పారిపోయారని తెలిపారు. కార్మికుల్లో ఇద్దరిని కొట్టారని విశ్వకర్మ తెలిపారు. ఈ ప్లాంట్‌లో దక్షిణాసియాకు చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారని, నిరసన సమయంలో వారు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని వివరించారు.