205 మంది వలసదారులతో భారత్‌కు అమెరికా సైనిక విమానం

205 మంది వలసదారులతో భారత్‌కు అమెరికా సైనిక విమానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. తాజాగా భారత్‌కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన మిలటరీ విమానం భారత్‌కు బయలుదేరింది. 

అందులో 205 మంది భారతీయులు ఉన్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించినట్లు ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. సీ17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్రమ వలసదారులను తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విమానం భారత కాలమాన ప్రకారం మంగళావారం ఉదయం 3 గంటలకు బయలుదేరింది. 

భారత్‌కు చేరుకోవడానికి సుమారు 24 గంటలు పడుతుందని అంచనా. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అమృతసర్ లో దిగుతుందని భావిస్తున్నారు. వారిలో అత్యధికులు పంజాబ్ కు చెందిన వారని, పొరుగు రాష్ట్రాల వారు కూడా ఉన్నారని తెలుస్తోంది.

“అమెరికా తన సరిహద్దుల రక్షణ చర్యలను తీవ్రంగా అమలు చేస్తోంది. వలస చట్టాలను కఠినతరం చేస్తోంది. అక్రమ వలసదారులను తొలగిస్తోంది. ఈ చర్యలు స్పష్టమైన సందేశాన్ని పంపుతాయి: అక్రమ వలసలు ప్రమాదానికి విలువైనవి కావు” అని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి ఈ సందర్భంగా చెప్పారు.

అక్రమవలసదారులపై ట్రంప్‌ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ వలసదారుల గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. తొలుత 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్‌ పాసో, టెక్సాస్‌, శాన్‌ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్‌ సిద్ధమైంది. 

ఇప్పటికే గటేమాలా, పెరు, హోండూరస్‌ తదితర దేశాలకు అమెరికా విమానాల్లో పలువురు వలసదారులను తరలించింది. ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు అవుతోందని సమాచారం. గతవారం గటెమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అగ్రరాజ్యం సుమారు 4,675 డాలర్లను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

భారత్‌ స్పందన ఇదే!
అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్  తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. 

అమెరికాలో సరైన ధ్రువపత్రాలు లేకుండా భారత్‌కు చెందిన వలసదారులు దాదాపు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18,000 మందిని భారత్‌కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. అమెరికాలో మెక్సికో, సాల్వెడార్‌ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల తొలివిడత తరలింపు జరుగుతుండడం గమనార్హం.