
సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. లాస్ ఏంజెలెస్‌లో ఘనంగా జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు. ప్రముఖ ఇండో-అమెరికన్ సంగీత విద్వాంసురాలు, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు.
మరో ఇద్దరితో కలిసి ఆమె ఈ అవార్డును పంచుకున్నారు. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి సోదరే చంద్రికా టాండన్. చెన్నైకు చెందిన వీరి కుటుంబంలో అమెరికాలో స్థిరపడింది. కాగా, చంద్రికా టాండన్ బెస్ట్ న్యూ ఏజ్, యాంబియంట్, చాంట్ ఆల్బమ్ విభాగంలో ‘త్రివేణి’ ఆల్బమ్ కు గ్రామీ అవార్డును దక్కించుకున్నారు. వౌటర్ కెల్లర్ మాన్, జపనీస్ సెల్లిస్ట్ ఎరు మాట్సుమోటోతో కలిసి ఈ అవార్డును గెలుచుకున్నారు.
అవార్డు అందుకున్న అనంతరం ‘ఇది అద్భుతంగా అనిపిస్తుంది’ అని టాండన్ వ్యాఖ్యానించారు. అలాగే సంగీతం అంటే ప్రేమ, కాంతి, నవ్వు అని చెప్పుకొచ్చారు. సంగీతాన్ని ఇష్టపడే వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బెస్ట్ న్యూ ఏజ్, యాంబియంట్, చాంట్ ఆల్బమ్ విభాగంలో రికీ కేజ్, ర్యూయిచి సకామోటో, అనౌష్క శంకర్, రాధికా వెకారియా నామినీలుగా ఉండగా, టాండన్ సహా మరో ఇద్దరు ఈ అవార్డును గెలుచుకున్నారు.
కాగా ఏడు ట్రాక్‌లు ఉన్న త్రివేణి అల్బమ్ 2024 ఆగస్టు 30న విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణానంతరం గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఆడియో బుక్ నేరేషన్, స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ విభాగంలో ఆయనకు మరణాంతరం గ్రామీ అవార్డు దక్కింది. ఈ అవార్డును జిమ్మీ కార్టర్ మనవడు జేసర్ కార్టర్ అందుకున్నారు.
జిమ్మీ కార్టర్ బతికున్నప్పుడు మూడు గ్రామీ అవార్డులను అందుకున్నారు. తాజాగా ఆయనకు మరో అవార్డు లభించింది. దీంతో జిమ్మీ కార్టర్ ఖాతాలో నాలుగో గ్రామీ అవార్డు చేరింది. మాజీ అధ్యక్షుడు తన మరణానికి ముందు గ్రామీ అవార్డు గెలిచినట్లైతే పెద్ద వయసులో ఈ ఆవార్డు అందుకున్న వ్యక్తిగా రికార్డుకెక్కేవారు.
2011లో 97 ఏళ్ల వయసున్న పినెటాప్ పెర్కిన్స్ గ్రామీ అవార్డును అందుకున్నారు. అత్యధిక వయసులో గ్రామీ అవార్డు అందుకున్న రికార్డు ఇప్పటికే ఆయన పేరిటే ఉంది.
కాగా, గతంలో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ కూడా గ్రామీ అవార్డులు దక్కించుకున్నారు. అలాగే ప్రథమ మహిళలు మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్ కూడా ఈ ఆవార్డును గెలుచుకున్నారు. మాజీ అధ్యక్షులు హ్యారీ ఎస్ ట్రూమాన్, జాన్ ఎఫ్ కెన్నెడీ, రిచర్డ్ నిక్సన్ నామినేట్ అయినా అవార్డును పొందలేకపోయారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!