ఆప్ కేంద్రంపై పోరాటంతో వెనుకబడిన ఢిల్లీ

ఆప్ కేంద్రంపై పోరాటంతో వెనుకబడిన ఢిల్లీ

డబుల్ ఇంజన్ బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు గత పది సంవత్సరాలలో పురోగమించాయని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సాకులు చూపుతూ కేంద్రంతో పోరాడిన కారణంగా ఢిల్లీ వెనుకబడిందని బిజెపి అగ్ర నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. జంగ్‌పురాలో ఒక బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, ఆయన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను ‘బడే మియాఁ, ఛోటే మియాఁ’ అంటూ అభివర్ణించారు. 

వారిద్దరు ఢిల్లీని ‘లూటీ చేశారు’ అని ఆయన ఆరోపించారు. ‘డబుల్ ఇంజన్ బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు గడచిన పది సంవత్సరాల్లో ప్రగతి సాధించాయి. ఢిల్లీ వెనుకబడింది. వారు సాకులు చెబుతూ, ఏడుపుగొట్టు పిల్ల వలె కేంద్రంతో పోరాడసాగారు’ అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పేర్కొన్నారు.

జంగ్‌పురా అసెంబ్లీ సీటు నుంచి బిజెపి అభ్యర్థి తార్విందర్ సింగ్ మార్వాహ్‌పై పోటీ చేస్తున్న సిసోడియాపై అమిత్ షా సరికొత్త విమర్శనాస్త్రాలు సంధిస్తూ, మద్యం కుంభకోణం సందర్భంగా జైలుకు వెళ్లిన దేశంలో ఏకైక విద్యా శాఖ మంత్రి ఆయనే అని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు అబద్ధాలు చెప్పారని, వారికి ఆయన చెత్త, విషపు నీరు, అవినీతి మాత్రమే ఇచ్చారని అమిత్ షా ఆరోపించారు.

‘బడే మియాఁ, ఛోటే మియాఁ తప్పుడు వాగ్దానాలు చేసిన తరువాత ఢిల్లీని దోచుకున్నారు. వారిద్దరు ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు’ అని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీని ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దగల ఏకైక పార్టీ బిజెపి అని అమిత్ షా చెప్పారు. యమునలో స్నానం చేస్తాననన్న తన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయినందుకు కూడా కేజ్రీవాల్‌ను ఆయన దుయ్యబట్టారు. 

కేజ్రీవాల్ నదిలో స్నానం చేయలేదు, దానితో బిజెపి కార్యకర్తలు ఆయన కటౌట్‌ను నదిలో ముంచారు. నదిలో కాలుష్యం వల్ల కటౌట్ చాలా దెబ్బ తిన్నదని వారు గ్రహించి దానిని ఎయిమ్స్‌లో చేర్పించవలసి వచ్చింది’ అని షా వ్యంగ్యోక్తి విసిరారు.

యమున నది తీరాన్ని మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని, ఢిల్లీ వాసులకు ఆయుష్మాన్ పథకం కింద ఉచిత ఆరోగ్యసేవలు అందిస్తామని బిజెపి అగ్ర నేత వాగ్దానం చేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఇల్లు, కారు లేదా భద్రత వంటి అధికారపూర్వక సదుపాయాలు వినియోగించుకోబోనని వాగ్దానం చేశారని ప్రజలకు ఆయన గుర్తు చేశారు. 

కానీ, ‘ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కారు, భద్రత, బంగళా ఉపయోగించుకున్నారు, ఒక బంగళాతో సంతృప్తి చెందక ఆయన నాలుగింటిని కూలగొట్టి, డిజైనర్ పాలరాయి, రిమోట్ కంట్రోల్డ్ కర్టెన్లు. మోషన్ సెన్సర్ లైట్లు, బంగారు కమోడ్, రూ. 50 కోట్లు ఖరీదు చేసే తివాచీ, రూ. 15 కోట్లు విలువ చేసే వాటర్ ప్యూరిఫయర్, రూ. 15 లక్షలు విలువ చేసే రిక్లైనింగ్ సోఫాతో 50 వేల చదరపు గజాల్లో ‘అద్దాల మేడ’ కట్టించుకున్నారు’ అని షా ఆరోపించారు.

సిసోడియాపై అమిత్ షా విరుచుకుపడుతూ, ఆ ఆప్ నేత విద్యను అలక్ష్యం చేశారని, దానికి బదులు ఢిల్లీలో ప్రతి మూల, మతపరమైన ప్రదేశాల సమీపాన కూడా మద్యం దుకాణాలు తెరిచారని ఆరోపించారు. 2016 చివర్లో పాకిస్థాన్ కేంద్రంగా గల ఉగ్రవాదులపై ‘లక్షిత దాడుల’ గురించి కూడా అమిత్ షా మాట్లాడారు.

‘పాకిస్తాన్ ఉరి, పుల్వామాలలో దాడులకు పురికొల్పింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కాదని, నరేంద్ర మోదీ అన్నది వారు మరిచారు. పది రోజుల్లోనే లక్షిత దాడుల నిర్వహణతో ఉగ్రవాదులను అంతం చేశాం’ అని ఆయన చెప్పారు. గడచిన పది సంవత్సరాల్లో దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు మోదీ కృషి చేశారని పేర్కొంటూ ఆయన ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.

‘జమ్మూ కాశ్మీర్‌లో 370 అధికరణాన్ని రద్దు చేసినట్లయితే ‘రక్తపుటేరులు ప్రవహిస్తాయి’ అని కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, మెహబూబా ముఫ్తీ సహా ప్రతిపక్ష నేతలు హెచ్చరించారని కూడా ఆయన తెలిపారు. ‘మేము 370 అధికరణాన్ని రద్దు చేశాం. రక్తపుటేరుల సంగతి మరచిపోండి, ఎవ్వరూ ఒక్క గులకరాయినీ విసిరే ధైర్యంచేయలేకపోయారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. 

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం గురించి అమిత్ షా ప్రస్తావిస్తూ, ‘మోదీ కేసు (బాబ్రీ మసీదు కూల్చివేత కేసు) గెలిచి, ఐదు సంవత్సరాల్లోనే రామ మందిరం నిర్మించే ముందు 550 సంవత్సరాల పాటు రామ్ లల్లా ఒక గుడారంలో ఉండిపోయారు’ అని చెప్పారు.